26/11 దాడులకు 12 ఏళ్లు 

26 Nov, 2020 09:00 IST|Sakshi

ముంబై: 26/11 ముంబై ఉగ్ర దాడులకు పన్నెండేళ్లు పూర్తయ్యాయి. ఈ దాడుల్లో అమరులైన భద్రతా సిబ్బందికి నివాళులర్పించే కార్యక్రమాన్ని నగర పోలీసులు నిర్వహిస్తున్నారు. కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని పరిమిత సంఖ్యలో ప్రజలను మాత్రమే అనుమతిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమం దక్షిణ ముంబైలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో కొత్తగా నిర్మించిన స్మారక చిహ్నంలో జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అమరులైన పోలీసు కుటుంబ సభ్యులు, భద్రతా సిబ్బంది హాజరవుతారని ఓ అధికారి బుధవారం తెలిపారు. రాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ, సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే, హోం మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్, డీజీపీ సుభోధ్‌ కుమార్‌ జైస్వాల్, ముంబై పోలీసు కమిషనర్‌ పరమ్‌బిర్‌ సింగ్‌ ఇతర ఉన్నతాధికారులు అమరవీరులకు నివాళులర్పించనున్నట్లు తెలిపారు.

తీర ప్రాంత రహదారి ప్రాజెక్టు కొనసాగుతున్న కారణంగా మెరైన్‌ డ్రైవ్‌ వద్ద ఉన్న పోలీస్‌ జింఖానా వద్ద ఉన్న స్మారకాన్ని పోలీసు ప్రధాన కార్యాలయానికి మార్చారు. 2008 నవంబర్‌ 26న పాకిస్తాన్‌ నుంచి పది మంది ఉగ్రవాదులు సముద్ర మార్గం ద్వారా వచ్చి కాల్పులు జరిపారు. 18 భద్రతా సిబ్బందితో పాటు 166 మంది ఈ దాడుల్లో మరణించారు. చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. దేశంలోని ఎలైట్‌ కమాండో ఫోర్స్‌ అయిన ఎన్‌ఎస్‌జీతో సహా భద్రతా దళాలు 9 మంది ఉగ్రవాదులను హతమార్చాయి.

మరిన్ని వార్తలు