అరటి పండు ఎంత పనిచేసింది.. 120 మందికి ఆసుపత్రిలో చేరిక

13 Jun, 2022 18:51 IST|Sakshi

అరటి పండు తినే ఎంత ఆరోగ్యంగా ఉంటామో చెప్పాల్సిన పనిలేదు. ప్రతీరోజు ఒక అరటి పండు తిన్నాలని పలువురు ఆరోగ్య నిపుణులు సైతం సూచిస్తుంటారు. అలాంటి అరటి పండు తిని ఏకంగా 120 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. 

వివరాల ప్రకారం.. వైశాలి జిల్లాలోని పాతేపూర్‌ బ్లాక్‌లో శనివారం రోజున.. సత్యనారాయణ స్వామి పూజ చేశారు. అనంతరం, ఆదివారం ఆ పూజకు వాడిన అరటి పండ్లను బ్లాక్‌లో ఉన్న మ‌హ‌తి ధరంచంద్ పంచాయ‌తీ వార్డు-10లో పలువురి ప్రసాదంగా పంచారు. దీంతో అరటి పండు ప్రసాదంగా తిన్న వారందరూ ఒక్కసారిగా వాంతులు చేసుకున్నారు. కడపు నొప్పి, విరోచనాలతో అనార్యోగానికి గురయ్యారు. దీంతో స్థానికులు వైద్యులకు సమాచారం అందించారు. 

పాతేపూర్‌ బ్లాక్‌కు చేరుకున్న వైద్యులు.. వారికి వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ అమితాబ్ కుమార్ సిన్హా మాట్లాడుతూ.. ప్రసాదంగా పంచిన అర‌టి పండ్లలో కెమిక‌ల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నాయన్నారు. అందుకే వారందరూ అస్వస్థతకు గురైనట్టు తెలిపారు. అంతేకాకుండా.. అరటిపండ్లను ఉడకబెట్టడం వ‌ల్ల ప్రసాదం క‌లుషిత‌మైందని వెల్లడించారు. అందుకే బాధితులకు వాంతులు, కడుపునొప్పి వచ్చాయన్నారు. కాగా, బాధితులు వెంటనే కోలుకోవటానికి ఓఆర్ఎస్ ప్యాకెట్ల‌ను అందించినట్టు చెప్పారు. అలాగే వారికి అవసరమైన మందులను కూడా స‌ర‌ఫ‌రా చేశామన్నారు. మరోవైపు.. బాధితుల్లో ఐదుగురి ఆరోగ్య పరిస్థితి బాగా క్షిణించడంతో వెంటనే వారిని పాతేపూర్ హెల్త్ సెంట‌ర్‌కు తరలించినట్టు తెలిపారు. 

ఇది కూడా చదవండి: ఔషధాల ఖజానా పుదీనా

మరిన్ని వార్తలు