దేశాన్ని హడలెత్తిస్తోన్న కరోనా సెకం‍డ్‌ వేవ్‌

9 Apr, 2021 04:21 IST|Sakshi
ఢిల్లీ మెట్రోలో మాస్క్‌ సరిగా ధరించని వారికి, సామాజిక దూరం పాటించని వారికి జరిమానా విధిస్తున్న అధికారులు

ఒకే రోజు 1,26,789 కేసులు 

మహారాష్ట్రలో 59,907 కేసులు నమోదు 

నోయిడా సహా యూపీ నగరాల్లో రాత్రి కర్ఫ్యూ 

టీకా రెండో డోసు తీసుకున్న ప్రధాని  

న్యూఢిల్లీ: కరోనా సెకండ్‌ వేవ్‌ దేశాన్ని హడలెత్తిస్తోంది. ప్రతి రోజూ ఒక కొత్త రికార్డు నమోదవుతోంది. గత 24 గంటల్లో 1,26,789 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1.29 కోట్లకు చేరుకుంది. ఒకే రోజు లక్షకు పైగా కేసులు నమోదవడం ఇది మూడో సారి. కరోనాతో 685 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మరణాల సంఖ్య 1,66,862కి చేరుకుంది. క్రియాశీలక కేసుల సంఖ్య 9,10,319కి చేరుకుంది. మహారాష్ట్రలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. కేవలం ఆ ఒక్క రాష్ట్రంలో ఒకేరోజు 59,907 కేసులు నమోదయ్యాయి.

టీకా రెండో డోసు తీసుకున్న ప్రధాని  
ప్రధాని∙మోదీ కోవిడ్‌ టీకా రెండో డోసు తీసుకున్నారు. టీకా మొదటి డోసు తీసుకున్న ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రిలో రెండో డోసు తీసుకున్నారు. ఈ సందర్భంగా అందరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.  

పట్టణాలే కరోనా హాట్‌స్పాట్స్‌
కరోనా సెకండ్‌ వేవ్‌లో కూడా పట్టణ ప్రాంతాలే వైరస్‌కు హాట్‌ స్పాట్స్‌గా మారాయి. మార్చిలో వెలుగులోకి వచ్చిన కోవిడ్‌–19 కేసుల్లో 48% పట్టణ ప్రాంతాల నుంచే వచ్చాయి. దేశ జనాభాలో ఈ ప్రాంతాల్లో 14%మంది నివసిస్తున్నారు. ఇక ఏప్రిల్‌లోని మొదటి నాలుగు రోజుల్లో కూడా అత్యధికంగా 51.9%కేసులు పట్టణ ప్రాంతాల నుంచే వచ్చినట్టుగా ఆరోగ్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇక నగరాల్లోనూ కరోనా ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతోంది. ముంబై, పుణె, నాగపూర్, చెన్నై, బెంగుళూరు ఢిల్లీ వంటి నగరాల నుంచే 42% కేసులు వస్తున్నాయి. కేసులు అధికంగా వస్తున్న ప్రాంతాల్లో వ్యాక్సిన్‌ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.  

► ఉత్తరప్రదేశ్‌ ఢిల్లీ సరిహద్దుల్లోని నోయిడా, ఘజియాబాద్‌లలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించారు. ఈ నెల 17వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. లక్నో, కాన్పూర్, వారణాసి, ప్రయాగ్‌రాజ్‌లో నైట్‌ కర్ఫ్యూ విధించారు. యూపీలో ఒక రోజు 6,023 కేసులు నమోదు కావడంతో అత్యధిక కేసులు వస్తున్న పట్టణాల్లో ఆంక్షల్ని కట్టుదిట్టం చేశారు.  

► మధ్యప్రదేశ్‌లోని పట్టణ ప్రాంతాల్లో మూడు రోజులు సంపూర్ణంగా లాక్‌డౌన్‌ విధిస్తున్నట్టుగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ప్రకటించారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు ఈ లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుంది. సంక్షోభ నివారణ కమిటీతో చర్చల అనంతరం వీకెండ్‌లో సమస్తం బంద్‌ చేయాలని సీఎం నిర్ణయించారు. రాష్ట్రంలో ఒకే రోజు నాలుగు వేలకు పైగా కేసులు నమోదు కావడంతో మూడు రోజుల కఠినమైన లాక్‌డౌన్‌ నిబంధనలు విధిస్తున్నట్టుగా చెప్పారు.

► అస్సాంలో విమానాల్లో ప్రయాణించే వారు తప్పనిసరిగా కోవిడ్‌ నెగిటివ్‌ రిపోర్టు ఇవ్వాలి.  

కర్ణాటకలో రేపటి నుంచి రాత్రి కర్ఫ్యూ
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో రెండోదఫా కరోనా కేసులు విస్తరిస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 8 జిల్లా కేంద్రాల్లో ఏప్రిల్‌ 10 నుంచి 20 వరకు రాత్రి పది గంటల నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు కర్ఫ్యూ విధించింది. బెంగళూరు, మైసూరు, మంగళూరు, కలబురిగి, బీదర్, ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ, తుమకూరు జిల్లా కేంద్రాల్లో రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు  సీఎం యడియూరప్ప తెలిపారు. కేరళ సీఎం పినరయి విజయన్‌ కరోనా వైరస్‌ సోకింది.  

తమిళనాడులో మినీ లాక్‌డౌన్‌
సాక్షి ప్రతినిధి, చెన్నై:  తమిళనాడులో కరోనా వైరస్‌ మళ్లీ పంజా విసురుతుండడంతో ప్రభుత్వం మినీ లాక్‌డౌన్‌ విధించింది. కరోనాను కట్టడి చేయడమే లక్ష్యంగా ఈ నెల 10వ తేదీ నుంచి పలు ఆంక్షలు అమల్లోకి వస్తాయని తెలిపింది. గురువారం అధికారిక గణాంకాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 4,276 పాజిటివ్‌ కేసులు, 19 మరణాలు నమోదయ్యాయి. రాజధాని నగరం చెన్నైలో 1,520 పాజిటివ్‌ కేసులు, 6 మరణాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ రంజన్‌ బుధవారం ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. గురువారం ప్రధాని నరేంద్రమోదీతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. పలు ఆంక్షలతో కూడిన మినీ లాక్‌డౌన్‌ ప్రకటించారు. కరోనా వైరస్‌ ప్రధాన లక్షణమైన జ్వరం బారినపడిన వారిని గుర్తించేందుకు ఇంటింటా పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. కరోనా తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో పూర్తి లాక్‌డౌన్‌ ఉంటుంది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు