Covid Deaths: కరోనా మరణాల్లో తగ్గుదల ఎప్పుడు?

27 May, 2021 06:02 IST|Sakshi

గత 24 గంటల్లో 4,157 మంది మృతి

ఈ నెలలో ప్రతీరోజు 4వేలకు పైగా మరణాలు దాటిన రోజులు 13

9.42%కి చేరిన పాజిటివిటీ రేటు

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో రోజువారీ కొత్త కరోనా పాజిటివ్‌ కేసుల్లో కాస్త తగ్గుదల కనిపిస్తున్నా.. రోజువారీ మరణాల సంఖ్యలో తగ్గుదల కనిపించట్లేదు. సెకండ్‌ వేవ్‌ ప్రారంభమైన తర్వాత మే నెలలో ఇప్పటివరకు 25 రోజుల్లో 13 రోజులు... 4వేలకుపైగా మరణాలు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కోవిడ్‌ కారణంగా 4,157 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించింది. దేశంలో వరుసగా గత పది రోజులుగా కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు 3 లక్షలలోపే నమోదవుతున్నాయి.

గత 24 గంటల్లో 2,08,714 కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,71,57,795కు పెరిగింది. గత 24 గంటల్లో 4,157 మంది కోవిడ్‌తో కన్నుమూశారు. దీంతో దేశంలో మొత్తం కోవిడ్‌ బాధితుల మరణాల సంఖ్య 3,11,388కు పెరిగింది. వరుసగా 13వరోజూ కొత్త కరోనా కేసుల సంఖ్య కంటే కోవిడ్‌ నుంచి కోలుకున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉంది. దేశంలో ప్రస్తుతం పాజిటివిటీ రేటు 9.42 శాతంగా నమోదైంది. గత 24 గంటల్లో 2,95,955 మంది కోవిడ్‌ నుంచి కోలుకున్నారు. దీంతో దేశంలో మొత్తం రికవరీల సంఖ్య 2,43,50,816కు పెరిగింది. దీంతో రికవరీ రేటు 89.66 శాతానికి పెరగడం విశేషం. మరణాల రేటు 1.15 శాతంగా నమోదైంది.

ఐసీఎంఆర్‌ తాజా గణాంకాల ప్రకారం దేశంలో ఇప్పటిదాకా 33,48,11,496 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. అందులో మంగళవారం 22,17,320 శాంపిళ్లను పరీక్షించారు. ఒక్కరోజులో ఇంతటి భారీస్థాయిలో టెస్ట్‌లు చేయడం ఇదే ప్రథమం. మరోవైపు, దేశంలో పాజిటివిటీ రేటు 9.42%కి చేరింది. దేశంలో జరుగుతున్న వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో భాగంగా ఇచ్చిన వ్యాక్సిన్‌ డోస్‌ల సంఖ్య 20 కోట్ల మైలురాయిని దాటింది. ఇప్పటివరకు మొత్తం 20,06,62,456 వ్యాక్సిన్‌ డోస్‌లు ఇచ్చారు. అందులో మంగళవారం ఒక్కరోజే 20,39,087 డోస్‌లు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రాష్ట్రాలకు, కేంద్రపాలితప్రాంతాలకు 22,00,59,880 కోవిడ్‌ వ్యాక్సిన్‌ డోసులను సరఫరా చేసింది. ఇందులో వృథానూ కలుపుకుని రాష్ట్రాలు, యూటీలు మొత్తంగా 20,13,74,636 డోస్‌లను వినియోగించాయి. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వద్ద ఇంకా 1,77,52,594 డోసులు అందుబాటులో ఉన్నాయి. మరో లక్ష వ్యాక్సిన్‌ డోసులు వచ్చే 3 రోజుల్లో కేంద్రం రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపనుంది.

మేలో 4వేలకుపైగా మరణాలు నమోదైన తేదీలు
తేదీ    మరణాలు
మే 7    4,233
మే 8    4,092
మే 11    4,198
మే 12    4,128
మే 13    4,000
మే 15    4,077
మే 16    4,098
మే 17    4,334
మే 18    4,339
మే 20    4,209
మే 21    4,194
మే 23    4,454
మే 25    4,159

మరిన్ని వార్తలు