గడ్చిరోలిలో భారీ ఎన్‌కౌంటర్‌

22 May, 2021 05:46 IST|Sakshi
మావోయిస్టుల మృతదేహాలు

13 మంది మావోయిస్టులు మృతి

చర్ల: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో శుక్రవారం పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో 13 మంది మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ఏడుగురు మహిళలున్నారని అధికారులు తెలిపారు. ఇటీవలే హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన దిలీప్‌ వాల్సే పాటిల్‌ తన మొట్టమొదటి పర్యటనలో భాగంగా శుక్రవారం గడ్చిరోలికి వచ్చిన సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఈటపల్లి తహశీల్‌లోని పైడి అటవీ ప్రాంతంలో మావోయిస్టుల సమావేశం జరుగుతోందన్న సమాచారం మేరకు ఆ ప్రాంతంలో జిల్లా పోలీసు విభాగానికి చెందిన సీ–60 కమాండోలు గాలింపు చేపట్టారు. వారిని గమనించిన మావోయిస్టులు యథేచ్ఛగా కాల్పులు ప్రారంభించారు. లొంగిపోవాలన్న హెచ్చరికలను పట్టించుకోకుండా కాల్పులు కొనసాగించారు.

ఈ సందర్భంగా జరిగిన ఎదురుకాల్పుల్లో 13 మంది మావోయిస్టులు చనిపోయారు. ఉదయం 6 నుంచి 7.30 గంటల మధ్య ఈ ఘటన చోటుచేసుకుందని గడ్చిరోలి ఎస్‌పీ అంకిత్‌ గోయెల్‌ తెలిపారు. మృతుల్లో ఆరుగురు పురుషులు, ఏడుగురు మహిళలున్నారనీ, వీరంతా కసన్సూర్‌ దళానికి చెందిన వారనీ ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ అటవీ ప్రాంతంలో తునికాకు సేకరణ జరుగుతుండటంతో వసూళ్ల విషయమై చర్చించేందుకే వీరంతా సమావేశమైనట్లు తెలుస్తోందన్నారు. ఈ ఘటనలో మరికొందరు మావోయిస్టులు కూడా గాయపడి ఉంటారనీ, ఘటనా స్థలి నుంచి తప్పించుకున్న వారికోసం కూంబింగ్‌ ముమ్మరం చేశామన్నారు. మృతుల్లో చాట్గాన్‌ లోకల్‌ గెరిల్లా స్క్వాడ్‌ ఇన్‌చార్జ్, డీవీసీఎం మహేష్‌ గోఠా ఉన్నాడు. మిగిలిన వారిని గుర్తించాల్సి ఉంది. ఘటనాస్థలి నుంచి ఒక ఏకే–47, ఒక ఎస్‌ఎల్‌ఆర్, ఒక కార్బయిన్, ఒక .303 రైఫిల్, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. జిల్లాలో 2020 సెప్టెంబర్‌ నుంచి జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 27 మంది వరకు మావోయిస్టులు మృతి చెందారని ఎస్‌పీ గోయెల్‌ వివరించారు.  
 

మరిన్ని వార్తలు