పార్లమెంట్ నుంచి 15 మంది ఎంపీల సస్పెన్షన్

14 Dec, 2023 16:56 IST|Sakshi

ఢిల్లీ: పార్లమెంట్‌లో అలజడి ఘటన తర్వాత సభ నుంచి 15 మంది ప్రతిపక్ష ఎంపీలు సస్పెన్షన్‌కు గురయ్యారు. వారిలో 14 మంది లోక్‌సభ నుంచి కాగా  ఒకరు రాజ్య సభకు చెందినవారున్నారు. ఇందులో 9 మంది కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు కాగా, ఇద్దరు సీపీఎం, ఒకరు సీపీఐ, మరో ఇద్దరు డీఎంకే పార్టీ ఎంపీలు ఉన్నారు. 

కాంగ్రెస్ ఎంపీలు మాణికం ఠాగూర్, ఎండీ జావేద్, వీకే శ్రీకందన్, బెన్నీ బెహనాన్, డీఎంకే ఎంపీలు కే కనిమొళి, ఎస్‌ఆర్ పార్థిబన్, సీపీఎం ఎంపీలు పీఆర్ నటరాజన్, ఎస్ వెంకటేషన్, సీపీఐ ఎంపీ కే సుబ్బరాయన్ సస్పెండ్ అయిన వారిలో ఉన్నారు.

సభలో వికృత చేష్టలకు పాల్పడిన ఆరోపణలతో టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ సస్పెండయ్యారు. సస్పెన్షన్ తర్వాత సభ నుంచి బయటకు వెళ్లడానికి ఆయన నిరాకరించారు. దీంతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మోషన్ తర్వాత ఈ అంశాన్ని హౌస్ ప్రివిలేజెస్ కమిటీకి పంపారు. ఈ స్పస్పెన్షన్‌ను రాజ్యాంగేతర చర్యగా కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ అభివర్ణించారు.

పార్లమెంట్‌లో అలజడి బుధవారం జరగగా.. అదే రోజు ఐదుగురు ఎంపీలను సస్పెండ్ చేశారు.  టిఎన్ ప్రతాపన్, హైబీ ఈడెన్, జోతిమణి, రమ్య హరిదాస్,  డీన్ కురియకోస్‌లను సస్పెండ్ చేస్తూ తీర్మానాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రవేశపెట్టారు. అయితే..పార్లమెంట్‌లో ఆగంతుకులు చొరబడి గ్యాస్ క్యానిస్టర్లను ప్రయోగించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించాలని ప్రతిపక్ష ఎంపీలు పట్టుబట్టారు.

ఇదీ చదవండి: పార్లమెంట్‌లో అలజడికి సూత్రదారి? వైరల్ చేయాలని వీడియోలను షేర్ చేసి..

>
మరిన్ని వార్తలు