Assam- Mizoram: 150 ఏళ్ల వివాదం 

29 Jul, 2021 01:06 IST|Sakshi

అస్సాం–మిజోరంల మధ్య 1,318 చదరపు కిలోమీటర్ల భూభాగంపై ఘర్షణలు 

బ్రిటిష్‌ పాలకుల చలవే

దేశాల మధ్య సరిహద్దు వివాదాలు సహజం కానీ రాష్ట్రాల మధ్య సరిహద్దులు భగ్గుమనడమేంటి ? భూభాగం గురించి సీఎం మధ్య మాటల యుద్ధం ఎందుకు? దాని వెనుకనున్న అసలు కారణాలు తెలుసుకోవాలంటే 150 ఏళ్ల కిందట నాటి చరిత్ర మూలాల్లోకి వెళ్లాలి.

ఈశాన్య రాష్ట్రాలంటే పచ్చని కొండలు, సుందరమైన మైదాన ప్రాంతాలు, దట్టమైన అటవీ ప్రాంతాలు, నదీనదాలు.. ఇలా ప్రకృతి అందాలే మన కళ్ల ముందు కదులుతాయి. అవే అటవీ ప్రాంతాలు అస్సాం, మిజోరం మధ్య అగ్గిరాజేశాయి.  బ్రిటీష్‌ పాలకులు తమ దేశం వెళుతూ వెళుతూ కశ్మీర్‌ను రావణ కాష్టం చేయడమే కాకుండా ఈశాన్య రాష్ట్రాల సరిహద్దుల్ని కూడా వివాదాస్పదం చేశారు. దేశానికి 1947లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అతి పెద్ద భూభాగమైన అస్సాం నుంచి మిగిలిన ప్రాంతాలను వేరు చేస్తూ మణిపూర్, త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ, అరుణాచల్‌ ప్రదేశ్, మిజోరం రాష్ట్రాలు 1963–1987 మధ్య కాలంలో ఏర్పాటు అయ్యాయి.  ఆ ప్రాంత ప్రజల సంస్కృతి, అలవాట్లు, చరిత్రను ఆధారంగా చేసుకొని ఆనాటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఏర్పాటు చేసింది. మిజోరం ప్రాంతాన్ని 1972లో కేంద్ర పాలిత ప్రాంతం చేయగా, 1987లో పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కట్టబెట్టారు. అస్సాంలోని మూడు జిల్లాలైన కచర్, హైలకండి, కరీంగంజ్‌లు, మిజోరంలోని మూడు జిల్లాలైన అయిజ్వాల్, కొలాసిబ్, మమిత్‌లు 165 కిలోమీటర్ల పొడవునా సరిహద్దుల్ని పంచుకుంటున్నాయి.  

బ్రిటీష్‌ ప్రభుత్వం ఏం చేసింది ?  
అసోం–మిజోరం మధ్య ఉన్న 165 కి.మీ. సరిహద్దు ప్రాంతం వివాదాస్పదం కావడానికి బ్రిటీష్‌ పాలకులు ఇచ్చిన రెండు వేర్వేరు నోటిఫికేషన్‌లే కారణం. లుషాయి కొండలు (అవే ఇప్పటి మిజోరం), కచర్‌ మైదాన ప్రాంతాల (అస్సాం భూభాగం) మధ్య సరిహద్దుల్ని నిర్ణయిస్తూ 1875లో తెల్లదొరలు ఒక నోటిఫికేషన్‌ విడుదల చేశారు. 1873 నాటి బెంగాల్‌ తూర్పు సరిహద్దు నియంత్రణ చట్టం ప్రకారం ఇన్నర్‌ లైన్‌ పర్మిట్‌ (ఐఎల్‌పీ) పద్ధతి ప్రకారం సరిహద్దుల్ని గుర్తించారు. అప్పట్లో మిజోరం ప్రాంతంలో నేతల్ని కూడా సంప్రదించి ఈ నిర్ణయం తీసుకున్నారు. మళ్లీ 1933లో మణిపూర్‌ లుషాయి కొండల సరిహద్దుల్ని నిర్ణయిస్తూ మరో నోటిఫికేషన్‌ జారీ చేశారు. దీంతో లుషాయి కొండలు అంటే ప్రస్తుత మిజోరంలో కొంత భాగం అస్సాం, మణిపూర్‌లలో కలిసింది. అయితే 1933 నోటిఫికేషన్‌ను తమని సంప్రదించకుండా చేశారన్న కారణంతో మిజో నేతలెవరూ దానిని అంగీకరించలేదు. 1875లో ఇచ్చిన నోటిఫికేషన్‌ ప్రకారం 1,318 చదరపు కిలో మీటర్ల భూభాగం తమదేనని మిజోరం వాదిస్తోంది. ఆ ప్రాంతంలో ఇప్పటికీ మిజో ప్రజలు వ్యవసాయం చేస్తున్నారు. మరోవైపు అస్సాం ప్రభుత్వం మిజోరం తమ భూభాగాన్ని దురాక్రమణ చేస్తోందని ఆరోపిస్తోంది.  
సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

ఘర్షణలు ఇలా.. 
అస్సాం, మిజోరం మధ్య ఘర్షణలు ఇప్పుడు కొత్తేం కాదు. 1994లో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. మిజోరం తమ భూభాగంలోకి చొరబడుతోందంటూ అస్సాం ప్రభుత్వం గగ్గోలు పెట్టింది. అప్పట్నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఇరు రాష్ట్రాల మధ్య సయోధ్యకు ప్రయత్నించినా ఫలించలేదు. 
2018లో మిజోరంకు చెందిన విద్యార్థి సంఘాలు వివాదాస్పద భూభాగంలో రైతులు విశ్రాంతి తీసుకోవడానికి కొన్ని చెక్క భవనాలు నిర్మించడంతో మళ్లీ వివాదం రాజుకుంది. అస్సాం పోలీసులు వాటిని ధ్వంసం చేశారు.   
2020 అక్టోబర్‌లో  ఇరపక్షాల మధ్య  జరిగిన ఘర్షణలతో ఎందరో గాయపడ్డారు. మిజోరంకు గుండెకాయ వంటిదైన జాతీయ రహదారి 306 ఏకంగా  12 రోజులు మూత పడింది. 
జూన్‌లో మిజోరం ప్రజలు ఆ భూభాగంలో వ్యవసాయం చేస్తూ ఉండడంతో మళ్లీ ఇరు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలు మొదలయ్యాయి. ßోంమంత్రి అమిత్‌ షా పర్యటన జరిగిన మర్నాడే ఘర్షణల్లో ఐదుగురు అస్సాం పోలీసులు, ఒక పౌరుడు మరణించడంతో విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. సరిహద్దు వివాదం పరిష్కా రానికి ఇప్పుడు అస్సాం ప్రభుత్వం సుప్రీం జోక్యాన్ని కోరుతోంది.  

మరిన్ని వార్తలు