సీటుబెల్ట్‌ ధరించక 16 వేల మంది మృతి

30 Dec, 2022 05:45 IST|Sakshi

హెల్మెట్‌ పెట్టుకోకపోవడంతో 46,593 మంది..

2021లో జరిగిన రోడ్డు ప్రమాదాలపై కేంద్రం నివేదిక

న్యూఢిల్లీ: దేశంలో 2021లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో సీటు బెల్ట్‌ పెట్టుకోకపోవడం వల్ల 16,397 మంది చనిపోయారు. వీరిలో 8,438 మంది సంబంధిత వాహనాల డ్రైవర్లు కాగా, 7,959 మంది ప్రయాణికులున్నారు. రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్‌ ధరించక పోవడం వల్ల 46,593 మంది మృతి చెందారు. వీరిలో 32,877 మంది వాహనచోదకులు, మిగతా 13,716 మంది ప్రయాణికులు. కేంద్ర రోడ్డు రవాణా హైవేల శాఖ ఈ మేరకు ఒక నివేదిక విడుదల చేసింది. 2021లో దేశవ్యాప్తంగా జరిగిన 4,12,432 రోడ్డు ప్రమాదాల్లో 1,53,972 మంది దుర్మరణం పాలవగా, 3,84,448 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో హెల్మెట్‌ ధరించని వారు 93,763 మంది, సీటు బెల్ట్‌ ధరించని వారు 39,231 మంది అని పేర్కొంది.

మొత్తం రోడ్డు ప్రమాదాల్లో 8.2% డ్రంకెన్‌ డ్రైవింగ్, రాంగ్‌ సైడ్‌ డ్రైవింగ్, జంపింగ్‌ రెడ్‌ లైట్, సెల్‌ ఫోన్‌ వాడకం వంటి కారణాలతోనే జరిగాయని తెలిపింది. జాతీయ రహదారులపై జరిగే 9.35% ప్రమాద మరణాలకు ఇవే కారణాలని తెలిపింది. 67.5% ప్రమాదాలు తిన్నగా ఉండే రహదారులపై జరుగుతున్నాయి.   గుంతలు, ఇరుకుగా, ఏటవాలుగా ఉండే రోడ్లపై 13.9% ప్రమాదాలు జరుగుతున్నాయని విశ్లేషించింది. కూడళ్లలో 20% ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. టి–జంక్షన్లలో జరిగే ప్రమాదాల్లోనే ఎక్కువ మంది చనిపోవడమో, గాయపడటమో జరుగుతోందని తెలిపింది. 2021లో అనుకూల వాతావరణ పరిస్థితుల్లోనే నాలుగింట మూడొంతుల ప్రమాదాలు సంభవించగా, మంచు, వర్షం, గాలుల తీవ్రత వల్ల 16% ప్రమాదాలు జరిగాయని వివరించింది. దేశంలో రహదారి ప్రమాదాలు ఎక్కువగా జరిగే రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, రాజస్తాన్‌లు మొదటి నాలుగు స్థానాల్లో నిలిచాయి.

మరిన్ని వార్తలు