రెండు ముక్కలైన విమానం 

8 Aug, 2020 03:04 IST|Sakshi
శుక్రవారం రాత్రి కోళీకోడ్‌ విమానాశ్రయంలో రెండు ముక్కలైన ఎయిర్‌ ఇండియా విమానం వద్ద సహాయక చర్యల దృశ్యం. (ఇన్‌సెట్లో) విమాన కాక్‌పిట్‌ భాగం

17 మంది దుర్మరణం

కేరళలోని కోళీకోడ్‌ ఎయిర్‌పోర్టులో దుర్ఘటన

భారీ వర్షం కారణంగా రన్‌వేను దాటి 50 అడుగుల లోయలో పడ్డ దుబాయ్‌–కోళీకోడ్‌ విమానం

కేరళలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. వందేభారత్‌ మిషన్‌లో భాగంగా దుబాయ్‌ నుంచి వస్తున్న దుబాయ్‌–కోళీకోడ్‌ ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం శుక్రవారం రాత్రి 7.40 గంటల సమయంలో కోళీకోడ్‌ ఎయిర్‌పోర్ట్‌లో దిగుతున్న సమయంలో ప్రమాదానికి లోనైంది. భారీగా వర్షం పడుతుండటంతో రన్‌వే నుంచి జారి పక్కనే ఉన్న దాదాపు 50 అడుగుల లోయలో పడిపోయింది. దాంతో బీ737 విమానం రెండు ముక్కలైంది. ఆ ఘోర ప్రమాదంలో పైలట్‌ సహా 17 మంది ప్రాణాలు కోల్పోయారు. 125 మంది వరకు గాయాలపాలయ్యారు. వారిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఆ విమానంలో 10 మంది చిన్నారులు సహా 184 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, ఐదుగురు సిబ్బంది కలిపి మొత్తం 191 మంది ఉన్నారని ఎయిర్‌ ఇండియా తెలిపింది. 


కోళీకోడ్‌: కేరళలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. వందేభారత్‌ మిషన్‌లో భాగంగా దుబాయ్‌ నుంచి వస్తున్న దుబాయ్‌–కాళికట్‌ ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం శుక్రవారం రాత్రి 7.40 గంటల సమయంలో కోళీకోడ్‌ ఎయిర్‌పోర్ట్‌లో దిగుతున్న సమయంలో ప్రమాదానికి లోనైంది. భారీగా వర్షం పడుతుండటంతో రన్‌వే నుంచి పక్కకు జారీ పక్కనే ఉన్న దాదాపు 50 అడుగుల లోతైన లోయవంటి ప్రదేశంలో పడిపోయింది. దాంతో ఆ బీ737 విమానం రెండు ముక్కలైంది. ఆ ఘోర ప్రమాదంలో పైలట్‌ కెప్టెన్‌ దీపక్‌ సాథే సహా 17 మంది ప్రాణాలు కోల్పోయారు. 125 మంది వరకు గాయాలపాలయ్యారు. వారిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉంది.

ఆ విమానంలో 10 మంది చిన్నారులు సహా 184 మంది ప్రయాణీకులు, ఇద్దరు పైలట్లు, ఐదుగురు సిబ్బంది కలిపి మొత్తం 191 మంది ఉన్నారని ఎయిర్‌ ఇండియా తెలిపింది. ప్రమాద సమయంలో విమానంలో అగ్ని ప్రమాదం జరగలేదని పేర్కొంది. ప్రమాదంపై తక్షణమే స్పందించిన సహాయ బృందాలు క్షతగాత్రులను వైద్యశాలలకు పంపించాయి. సహాయ కార్యక్రమాలను రాష్ట్ర మంత్రి మొయిదీన్‌ పర్యవేక్షిస్తున్నారు. కోళీకోడ్, మలప్పుర్‌ జిల్లాల నుంచి ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను ఘటనాస్థలికి తరలించారు.

‘అది టేబుల్‌ టాప్‌ రన్‌వే. విమానం లోతైన లోయలో పడిపోయింది. మరణాలే కాకుండా, దాదాపు ప్రయాణీకులందరికీ గాయాలయ్యే అవకాశం ఉంది. అందుకే, పెద్ద సంఖ్యలో అంబులెన్స్‌లను, ఇతర సహాయ సామగ్రిని ఘటన స్థలికి పంపించాం’ అని ఎన్‌డీఆర్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ ప్రధాన్‌ తెలిపారు. వర్షం, వెలుతురు సరిగ్గా లేకపోవడం సహాయక చర్యలకు ఆటంకంగా మారాయన్నారు. దాదాపు 100 మందిని సమీప వైద్యశాలలకు తరలించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. రన్‌వేపై చివరి వరకు విమానం వేగంగా వెళ్లి లోయలో పడి, రెండు ముక్కలుగా విరిగిపోయిందని డీజీసీఏ ప్రకటించింది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించినట్లు ప్రకటించింది. విమానం ల్యాండింగే సరిగ్గా జరగనట్లుగా ప్రాథమిక సమాచారం ఉందని డీజీసీఏ డైరెక్టర్‌ అరుణ్‌ కుమార్‌ వెల్లడించారు. 
ప్రమాదస్థలంలో కొనసాగుతున్న సహాయక చర్యలు 

ప్రధానమంత్రి మోదీ దిగ్భ్రాంతి 
ప్రమాద ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. సహాయ చర్యలకు సంబంధించి కేంద్రం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని కేరళ సీఎం విజయన్‌కు ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ప్రమాద ఘటనపై సమాచారం అందగానే సహాయ చర్యలకు ఆదేశించామని విజయన్‌ ప్రధానికి వివరించారు. సహాయ చర్యలు పూర్తి స్థాయిలో కొనసాగుతున్నాయని తెలిపారు. ఘటనపై గవర్నర్‌కు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకున్నానని రాష్ట్రపతి కోవింద్‌ ట్వీట్‌ చేశారు. ప్రమాద ఘటనపై తీవ్ర ఆవేదన చెందుతున్నానని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. 

ఏపీ సీఎం జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి 
సాక్షి, అమరావతి: కేరళలోని కోళీకోడ్‌లో ఎయిర్‌ ఇండియా విమానం ప్రమాదానికి గురికావడం పట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.  
కోళీకోడ్‌ విమానాశ్రయం రన్‌వే 

షార్జా, దుబాయ్‌ల్లో సహాయ కేంద్రాలు 
ఘటనలో మరణించిన, గాయపడిన ప్రయాణీకులు, సిబ్బంది వివరాలు తెలిపేందుకు షార్జా, దుబాయ్‌ల్లో సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. +971565463903, +9715430 90572, +971543090575 హెల్ప్‌లైన్‌లను ప్రారంభించారు. బాధితుల కుటుంబ సభ్యులకు పూర్తి సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని అక్కడి భారత రాయబారి డాక్టర్‌ అమన్‌ పురి తెలిపారు.  కేరళలోని బాధితుల కుటుంబ సభ్యుల కోసం 0495–2376901 హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసినట్లు కోళీకోడ్‌ కలెక్టర్‌ తెలిపారు.  

మరిన్ని వార్తలు