లక్కీ ఛాన్స్‌! 18 ఏళ్లకే బ్రిటీష్‌ హై కమిషనర్‌

11 Oct, 2020 13:58 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లో బ్రిటీష్‌ హైకమిషనర్‌ పదవి గొప్ప పేరు ప్రఖ్యాతులు, బాధ్యత గలది. అంతటి హై ఫ్రొఫైల్‌ ఉద్యోగం 18 ఏళ్ల యువతి చైతన్య వెంకటేశ్వరన్‌ను వరించింది. అవును, భారత్‌లో బ్రిటీష్‌ హై కమిషనర్‌గా ఆమె గత బుధవారం ఒక రోజు సేవలందించారు. 2017 నుంచి బ్రిటీష్‌ హై కమిషన్‌ భారత్‌లో.. ‘ఒక రోజు హై కమిషనర్‌’ అనే పోటీని నిర్వహిస్తోంది. 18 నుంచి 23 ఏళ్ల యువతులు ఈ పోటీకి అర్హులు. ప్రపంచవ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లు, స్త్రీ సాధికారతపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నారు. ఒకరోజు హైకమిషన్‌గా అవకాశం రావడం పట్ల చైతన్య ఆనందం వ్యక్తం చేశారు. ఇది తనకు లభించిన సువర్ణ అవకాశమని అన్నారు. మహిళా సాధికారత కోసం పాటుపడతానని చెప్పుకొచ్చారు. 
(చదవండి: ఆధునిక బానిసత్వంలో ‘ఆమె’)

ప్రపంచ బాలికల దినోత్సవం (అక్టోబర్‌ 11) సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ప్రస్తుత బ్రిటీష్‌ హైకమిషర్‌ జాన్‌ థాంప్సన్‌‌ తెలిపారు. చైతన్య ఉన్నత భావాలు గల అమ్మాయి అని చెప్పారు. హై కమిషనర్‌గా ఆమె చక్కని పనితీరు కనబర్చిందని మెచ్చుకున్నారు. ఏడాదికి ఒకసారి జరిగే ఈ పోటీలు తనకెంతో ఇష్టమని చెప్పారు. భారత్‌, బ్రిటన్‌ మహిళల శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటేందుకు చేస్తున్న కృషికి ఈ కార్యక్రమం నిదర్శనమని థాంప్సన్ పేర్కొన్నారు. కాగా, చైతన్య విధుల్లో ఉండగా..  థాంప్సన్ డిప్యూటీ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ ఏడాది ఒకరోజు హైకమిషనర్‌ పోటీలకు 215 ఎంట్రీలు కాగా.. చైతన్యకు అవకాశం లభించింది. ఒకరోజు హైకమిషనర్‌గా పనిచేసిన వారిలో చైతన్య నాలుగో వ్యక్తి.
(చదవండి: కరోనా ఉందని మర్చేపోయాను!)

మరిన్ని వార్తలు