షెడ్యూల్‌ ప్రకారమే ‘గగన్‌యాన్‌’: ఇస్రో

29 Jun, 2021 12:42 IST|Sakshi

బెంగళూరు: భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గగన్‌యాన్‌ కార్యక్రమంపై కరోనా మొదటి, రెండో వేవ్‌లు తీవ్ర ప్రతికూల ప్రభావం చూపాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అధికారులు వెల్లడించారు. హార్డ్‌వేర్‌లను సమకూర్చుకోవడంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర య్యాయని తెలిపారు. డిజైన్, అనాలిసిస్, డాక్యుమెంటేషన్‌ వంటివి తామే సొంతంగా పూర్తి చేసినప్పటికీ హార్డ్‌వేర్‌లను మాత్రం దేశవ్యాప్తంగా వందలాది కంపెనీల నుంచి సమకూర్చుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి, రెండు వేవ్‌లు, లాక్‌డౌన్ల వల్ల వీటి ఉత్పత్తి, సరఫరాలో తీవ్ర అంతరాయం కలిగినట్లు చెప్పారు.

అయినప్పటికీ షెడ్యూల్‌ ప్రకారమే గగన్‌యాన్‌ కార్యక్రమం నిర్వహిస్తామని, ఇందు కోసం కాలంతో పోటీపడి పని చేస్తున్నామని చెప్పారు. గగన్‌యాన్‌లో భాగంగా ఈ ఏడాది డిసెంబర్‌లో తొలి మానవ రహిత అంతరిక్ష నౌకను నింగిలోకి పంపాల్సి ఉంది. అలాగే 2022–23లో మరో మానవ రహిత స్పేస్‌క్రాఫ్ట్‌ను అంతరిక్షంలోకి పంపేలా షెడ్యూల్‌ రూపొందించారు. లో ఎర్త్‌ ఆర్బిట్‌లోకి మనుషు లను అంతరిక్ష నౌకలో పంపించి, క్షేమంగా వెనక్కి తీసుకురావాలన్నదే గగన్‌యాన్‌ కార్యక్రమం ఉద్దేశం. ఇందుకోసం నలుగురు భారత వ్యోమగాములు ఇప్పటికే రష్యాలో జనరిక్‌ స్పేస్‌ ఫ్లైౖట్‌ శిక్షణ పొందుతున్నారు. గగన్‌యాన్‌ కార్యక్రమాన్ని 2018 ఆగస్టు 15న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే.  

ఇక్కడ చదవండి: నెంబర్‌ 1 గా నిలిచిన బెంగళూరు

మరిన్ని వార్తలు