చిల్డ్రన్స్ డే రోజు విషాదం.. స్కూల్‌ బస్సు బోల్తా, ఇద్దరు మృతి

14 Nov, 2022 21:24 IST|Sakshi

డెహ్రాడూన్‌: బాలల దినోత్సవం (నవంబర్‌ 14) రోజున విషాదం చోటుచేసుకుంది. స్కూల్‌ పిల్లలతో వెళ్తున్న బస్సు బోల్తా పడిన ఘటన ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో సోమవారం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థితో సహా ఉపాధ్యాయుడు మరణించారు. మరికొంతమంది చిన్నారులు గాయపడ్డారు. నాయగావ్‌ భట్టే పరిధిలోని కిచ్చా ప్రాంతానికి చెందిన వేదారం స్కూల్‌ విద్యార్థులను చిల్డ్రన్స్ డే సందర్భంగా పిక్నిక్‌కు తీసుకెళ్లారు. సితార్‌గంజ్‌ ప్రాంతంలో బస్సు ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 51 మంది చిన్నారులు ఉన్నట్లు గుర్తించారు. 

స్కూల్ పిల్లల కేకలు విన్న స్థానికులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకొని సాయం చేసేందుకు ముందుకొచ్చారు. అధికారులకు సమాచారం ఇవ్వగా సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ దుర్ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన విద్యార్థులకు చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. 
చదవండి: రాష్ట్రపతి ముర్మును క్షమాపణలు కోరిన సీఎం మమతా.. ఎందుకంటే?

మరిన్ని వార్తలు