పాక్‌ వక్రబుద్ధి: ఇద్దరు భారత జవాన్లు వీర మరణం

27 Nov, 2020 15:12 IST|Sakshi

న్యూ ఢిల్లీ : పాకిస్తాన్‌ సైన్యం మరోమారు ఏకపక్ష కాల్పులకు తెగబడింది. జమ్మూకశ్మీర్‌ లోని  రాజౌరీ జిల్లాలో సుందర్బనీ సెక్టార్‌లో నియంత్రణ రేఖ (ఎల్​ఓసీ) వెంబడి కాల్పులకు తెగబడి.. పాక్‌ తన వక్రబుద్ధిని బయటపెట్టింది. శుక్రవారం జరిగిన ఈ దాడిలో ఇద్దరు భారత జవానులు  రైఫిల్‌మన్ సుఖ్‌బీర్ సింగ్, నాయక్ ప్రేమ్ బహదూర్ ఖాత్రి  అమరులయ్యారని రక్షణ శాఖ తెలిపింది. పాకిస్తాన్‌ చేసిన ఈ దాడిని భారత సైన్యం దీటుగా ఎదుర్కొందని రక్షణ శాఖ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.ఇటీవల జమ్మూలోని నగ్రోటా వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌ ప్రదేశంలో దొరికిన కీలక సమాచారం ఆధారంగా సరిహద్దు భద్రతా బలగాలు భారత్‌- పాకిస్తాన్‌ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి గల సుమారు 200 మీటర్ల పొడవు గల సొరంగాన్ని కనుగొన్నాయి.

కొద్దిరోజుల క్రితం నలుగురు జైషే మహ్మద్‌ ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. వారు భారత్‌లోకి ప్రవేశించేందుకు స్వరంగా మార్గాన్ని ఎంచుకున్నట్లు రక్షణ శాఖ తెలిపింది. పక్కా పథకం ప్రకారం కశ్మీర్‌లో  ఉగ్రదాడికి పాల్పడేందుకు సిద్ధమైన ముష్కరులు, ఈ క్రమంలో 8 మీటర్ల లోతు, 200- మీటర్ల పొడవు గల సొరంగాన్ని తవ్వినట్లు గుర్తించినట్లు పేర్కొం‍ది.. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి 160 మీటర్ల దూరంలో గల ఈ సొరంగం కొత్తగా తవ్విందని, దీని గుండా కశ్మీర్‌లోకి చొరబడి ఆత్మాహుతి దాడికి పాల్పడేందుకు ఉగ్రవాదులు పథకం రచించారని భద్రతా అధికారులు అభిప్రాయపడ్డారు. జమ్మూ కశ్మీర్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు అవరోధం కలిగించడమే వీరి లక్ష్యంగా భావిస్తున్నట్లు తెలిపారు. చదవండి : కంటతడి పెట్టిస్తున్న జవాను వాట్సాప్‌ చాట్

మరిన్ని వార్తలు