వివక్షపై విజయానికి రెండేళ్లు.. ప్రియాంక ట్వీట్‌

6 Sep, 2020 14:08 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : స్వలింగ సంపర్కం నేరం కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పును వెలువరించి నేటికి రెండేళ్లు పూర్తయ్యింది. ఎల్జీబీటీలపై (లెస్బియన్-గే-బైసెక్సువల్-ట్రాన్స్‌జెండర్) 157 ఏళ్ల పాటుసాగిన విపక్షపై విజయంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు న్యాయ చరిత్రలో మరో చారిత్రక అధ్యయాన్ని లిఖించింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌ స్టార్‌నటి ప్రియాంక చోప్రా నాటి జడ్జ్‌మెంట్‌ను గుర్తుచేస్తూ తన వ్యక్తిగత సోషల్‌ మీడియా ఖాతాలో ఓ పోస్ట్‌ చేశారు. చారిత్రాత్మక తీర్పుకు రెండేళ్లు అంటూ పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా తీవ్ర వివక్షకు గురవుతున్న ఎల్జీబీటీకు సుప్రీం తీర్పుతో న్యాయం జరిగిందని గ్లోబర్‌ స్టార్‌ ప్రియాంక అభిప్రాయపడ్డారు.

కేసు పూర్వాపరాలు తెలుసుకుందాం....
స్వలింగ సంపర్కం నేరం కాదని 2019 సెప్టెంబర్‌ 6న చారిత్రాత్మక తీర్పును వెలువరించిన విషయ తెలిసిందే. భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ)లోని సెక్షన్ 377 కింద గే సెక్స్‌‌లో పాల్గొనే వారికి శిక్ష విధించడం సరికాదని తేల్చి చెప్పింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రాతోపాటు జస్టిస్ డీవై చంద్రచుద్, రోహింటన్ ఫాలి నారీమన్, ఏఎం ఖన్వీల్కర్, ఇందు మల్హోత్రాలతో కూడిన న్యాయస్థానం తీర్పు వెలువరించింది. గే సెక్స్‌ను నేరంగా పరిగణించడం సహేతుకం కాదని జస్టిస్ దీపక్ మిశ్రా అభిప్రాయపడ్డారు. లెస్బియన్-గే-బైసెక్సువల్-ట్రాన్స్‌జెండర్ (ఎల్జీబీటీ)లకు కూడా ఇతర పౌరుల్లాగే సమాన హక్కులు ఉంటాయని ధర్మాసనం స్పష్టం చేసింది. 

సెక్షన్ 377 ప్రకారం ఇప్పటి వరకూ హోమో సెక్స్ నేరం. అంటే ప్రకృతి విరుద్ధంగా.. స్త్రీలు స్త్రీలతో, పురుషులు పురుషులతో లేదా జంతువులతో అసహజ లైంగిక చర్యలకు పాల్పడటం శిక్షార్హం. 1861లో ఈ సెక్షన్‌ను అప్పటి బ్రిటిష్‌ పాలకులు భారత శిక్షా స్మృతిలో ప్రవేశపెట్టారు. 1861 నాటి చట్టం ప్రకారం గే సెక్స్‌లో పాల్గొనే వారికి గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. 1533 నాటి (బగ్గరీ యాక్ట్) ఆధారంగా నాటి బ్రిటీష్ పాలనలో ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. హోమో సెక్స్ సహా అసహజ శృంగారానికి పాల్పడటం సెక్షన్ 377 ప్రకారం నేరం. ఈ చట్టం తొలినుంచి వివాదాస్పదమవుతూనే ఉంది.

హిజ్రాలను థర్డ్ జెండర్‌గా గుర్తించాలి...
సెక్షన్ 377 వివాదం తొలిసారిగా 2001లో తెరమీదకు వచ్చింది. నాజ్ ఫౌండేషన్ అనే ఎన్జీవోతోపాటు ఎయిడ్స్ బేదభావ్ విరోధ్ ఆందోళన్‌లు ఢిల్లీ హైకోర్టులో పిటీషన్లు వేయగా.. వాటిని న్యాయస్థానం కొట్టివేసింది. హోమో సెక్సువాలిటీ నేరం కాదని ఎనిమిదేళ్ల తర్వాత ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించింది. కానీ సుప్రీం కోర్టులో రివ్యూ పిటీషన్ దాఖలు చేయగా.. 2013లో అత్యున్నత ధర్మాసనం ఢిల్లీ హైకోర్టు తీర్పును కొట్టివేసింది. హిజ్రాలను థర్డ్ జెండర్‌గా గుర్తించాలని 2014లో సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. వారిని ఓబీసీ కోటాలో చేర్చాలని కూడా స్పష్టం చేసింది. దీంతో ఎల్జీబీటీ కమ్యూనిటీలో కొత్త ఆశలు చిగురించాయి.

ఈ నేపథ్యంలోనే నాజ్ ఫౌండేషన్ జడ్జిమెంట్‌ను పునః పరిశీలించాలని కోరుతూ ఐదుగురు పిటిషనర్లు సుప్రీంను ఆశ్రయించారు. ఈ ఏడాది జనవరిలో ముగ్గురు సభ్యుల బెంచ్ ఈ పిటీషన్‌ను పరిశీలించింది. ఈ కేసును ఐదుగురు సభ్యుల బెంచ్‌కు రిఫర్ చేశారు. దీనిపై జోక్యం చేసుకుని తమ అభిప్రాయాన్ని  తెలపాల్సిందిగా కేంద్రాన్ని సైతం సుప్రీం కోరింది. ఈ రిట్ పిటీషన్లను చర్చిల సంఘాలు, క్రిస్టియన్ సంఘాలు, కొన్ని ఎన్జీవోలు తీవ్రంగా వ్యతిరేకించాయి. 

గత జులైలో సెక్షన్ 377 విషయం సుప్రీంలో వాదనకు వచ్చింది. హోమో సెక్సువాలిటీ అనేది ఉల్లంఘన కాదు, వైవిధ్యం మాత్రమేనని జూలై 12న విచారణ సందర్భంగా జస్టిస్ ఇందు మల్హోత్రా అభిప్రాయపడ్డారు. కుటుంబ సభ్యుల ఒత్తిడి, సమాజం నుంచి ఒత్తిళ్ల నేపథ్యంలో ఇలాంటి వారు తమకు నచ్చుకున్నా అపోజిట్ సెక్స్ ఉన్నవాళ్లను పెళ్లి చేసుకోవాల్సి వస్తోంది. దీనివల్ల బై సెక్సువాలిటీ, ఇతర మానసిక ఇబ్బందులు తలెత్తుతున్నాయని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను సెక్షన్ 377 కాలరాస్తోందని పిటిషనర్లు వాదించారు. సెప్టెంబర్ 6, 2018న హోమోసెక్సువాలిటీ నేరం కాదని ఐదుగురు జడ్జిల బెంచ్ చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. దీంతో ఎల్జీబీటీ వర్గాలు సంబరాలు చేసుకుంటున్నాయి.

చరిత్ర క్షమాపణ చెప్పాలి
చరిత్ర వారికి క్షమాపణ చెప్పాలంటూ సుప్రీం బెంచ్‌ వ్యాఖ్యానించింది. స్వలింగ సంపర్కులకు కూడా రాజ్యాంగం ప్రకారం అన్ని సమాన హక్కులు లభిస్తాయని  సుప్రీం కోర్టు తెలిపింది. తద్వారా  సెక్షన్‌ 377పై సుదీర్ఘ కాలంగా (సుమారు 157 ఏళ్లు) సాగుతున్న వివాదానికి  స్వస్తి పలికింది. అయితే జంతువులతో లైంగిక చర్యను, చిన్నారులతో అసహజ శృంగారాన్ని మాత్రం నేరంగానే పరిగణించాలని కోర్టు స్పష్టం చేసింది.

మరిన్ని వార్తలు