చికెన్‌.. చికెన్‌.. మటన్‌.. చికెన్‌

24 Dec, 2020 07:55 IST|Sakshi

చికెన్‌ బిర్యానీ.. మోస్ట్‌ ఫేవరేట్‌ డిష్‌ ఇదే

సెకనుకు ఒకటి కంటే ఎక్కువ

వెజ్, నాన్‌వెజ్‌ బిర్యానీలకు ఆర్డర్లు

తర్వాతి స్థానాల్లో మసాలా దోశ,

పన్నీర్‌ బటర్‌ మసాలా,  చికెన్‌ ఫ్రైడ్‌ రైస్‌

‘స్విగ్గీ’ రిపోర్ట్‌లో ఆసక్తికరమైన అంశాలు వెల్లడి

ఏం తిందాం? రెస్టారెంట్‌కు వెళ్లినా... ఇంటికి పార్శిల్‌ తెప్పించుకున్నా వచ్చే మొదటి ప్రశ్న. అడగడం పూర్తయిందో లేదో... సమాధానం వచ్చేస్తుంది. బిర్యానీ... అదీ చికెన్‌ బిర్యానీ. బిర్యానీకి హైదరాబాద్‌ ఎప్పుటినుంచో ఫేమస్‌. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే ట్రెండ్‌. మనోళ్లు చికెన్‌ బిర్యానీ అంటే చాలు లొట్టలేస్తూ లాగించేస్తున్నారు. భారతీయులకు చికెన్‌ బిర్యానీయే అత్యంత ప్రీతిపాత్రమైన డిష్‌ అని మరోసారి రుజువైంది. అంతేకాకుండా నాన్‌వెజ్, వెజ్‌ అనే తేడాలు లేకుండా 2020లో మనదేశంలో ప్రతీ సెకనుకు ఒకటి కంటే ఎక్కువగా బిర్యానీ పార్శిల్‌ ఆర్డర్లు వస్తున్నాయి. మొత్తం ఆర్డర్లలో... అత్యధికంగా ఆర్డర్‌ చేసింది చికెన్‌ బిర్యానీ కాగా ఆ తర్వాతి స్థానాల్లో మసాలా దోశ, పన్నీర్‌ బటర్‌ మసాలా, చికెన్‌ ఫ్రైడ్‌ రైస్, మటన్‌ బిర్యానీ, గార్లిక్‌ బ్రెడ్‌ స్టిక్స్‌ నిలిచాయి. దేశంలో 2020 జనవరి నుంచి డిసెంబర్‌ దాకా వచ్చిన లక్షలాది ఆర్డర్లను ఫుడ్‌ డెలివరీ యాప్‌ ‘స్విగ్గీ’విశ్లేషించింది. స్విగ్గీ విడుదల చేసిన ఐదో ఎడిషన్‌ స్టాట్‌‘ఈట్‌’స్టిక్స్‌ రిపోర్ట్‌లో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి.     
– సాక్షి, హైదరాబాద్‌

హెల్తీఫుడ్‌కు మెట్రోల మొగ్గు: 
హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ వంటి మెట్రోలలో ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల కోసం మొగ్గుచూపుతున్నట్టు తేలింది. సూపర్‌ గ్రెయిన్స్‌ ఆధారిత ఆహారాన్ని కోరే ఆర్డర్ల సంఖ్య ఈ ఏడాది 127 శాతం పెరిగింది. శాకాహార పదార్థాల ఆర్డర్లు 50 శాతం, అధికప్రొటీన్‌ ఫుడ్‌ ఆర్డర్లు 49 శాతం పెరిగాయి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ హెవీగా తీసుకోవడం, మధ్యాహ్నభోజనం ఓ మోస్తరుగా, రాత్రిపూట మితంగా తినడమనేది పాటించదగ్గ ఆరోగ్యసూత్రం. మెట్రోల్లో దీన్ని జనం ఆచరిస్తున్నారని తేలింది. సగటున 427 కేలరీల శక్తినిచ్చే ఆహారాన్ని బ్రేక్‌ఫాస్ట్‌లో, 350 కేలరీల ఫుడ్డును లంచ్‌కు, సగటున 342 కేలరీలనిచ్చే ఆహారాన్ని డిన్నర్‌లో తీసుకుంటున్నారని తమ ఆర్డర్లను బట్టి స్విగ్గీ విశ్లేషించింది. హైఫైబర్‌ ఇడ్లీ, హైప్రోటీన్‌ కిచ్‌డీ, కొవ్వుతక్కువుండే సలాడ్లు, శాండ్‌విచెస్, గ్లూటెన్‌ రహిత ఐస్‌క్రీమ్‌లను ఆరోగ్యకరమైన అలవాట్లలో భాగంగా ఎక్కువ తీసుకుంటున్నారు. 


స్ట్రీట్‌ ఫుడ్‌కూ డిమాండే.. 
పానీపూరి, ఇతర స్ట్రీట్‌ఫుడ్‌ను సైతం వినియోగదారులు స్విగ్గీ ద్వారా ఆర్డర్‌ చేస్తున్నారు. లాక్‌డౌన్‌ అనంతరం 2 లక్షలకు పైగా పానీపూరి ఆర్డర్లను డెలివరీ చేశారు. పీఎం స్వనిధి స్కీంతో భాగస్వామ్యంలో భాగంగా దేశంలోని 125 నగరాల్లోని 36 వేల వీధివ్యాపారుల ద్వారా మరిన్ని స్ట్రీట్‌ ఫుడ్‌ ఐటెమ్స్‌ రకాలను అందుబాటులోకి తీసుకురానున్నట్టు స్విగ్గీ ప్రకటించింది.

 

► ఈ ఏడాది నమోదైన 3 లక్షల మంది కొత్త స్విగ్గీ వినియోగదారుల మొట్టమొదటి ఆర్డర్‌ చికెన్‌ బిర్యానీయే. 
► ఈ ఏడాది 1 వెజ్‌బిర్యానీకి 6 చికెన్‌ బిర్యానీ నిష్పత్తిలో ఆర్డర్లు వచ్చాయి 
► లాక్‌డౌన్‌ మొదలు ఇప్పటివరకు పానీపూరీల కోసం 2 లక్షల ఆర్డర్‌ చేశారు 
► స్విగ్గీ ద్వారా ఇంట్లో వండుకోవడానికి తెప్పించుకునే మాంసాహారంలోనూ చికెన్‌దే అగ్రస్థానం. 6 లక్షల కేజీల చికెన్‌ను డెలివరీ చేశారు. తర్వాతి స్థానంలో చేపలు నిలిచాయి.  
► మాంసాహారాన్ని ఎక్కువగా ఇష్టపడే నగరాల్లో బెంగళూరుది మొదటిస్థానం. 
► ఈ ఏడాది ‘లాక్‌డౌన్‌ బర్త్‌డేస్‌’సెలబ్రేషన్స్‌ కోసం 6 లక్షల కేక్‌లు డెలివరీ అయ్యాయి. 
►  స్విగ్గీ డెలివరీ స్టాఫ్‌కు భోపాల్, బెంగళూరుకు చెందిన ఇద్దరు వినియోగదారులు అత్యధికంగా రూ.5 వేల చొప్పున టిప్పులిచ్చారు .

​​​​​​​హైదరాబాద్‌ అభి‘రుచు’లు
1) చికెన్‌ బిర్యానీ 
2) ఇడ్లీ 
3) మసాలా దోశ 
4) చికెన్‌ 65
5) పన్నీర్‌ బటర్‌ మసాలా 
6) వడ 
7) మటన్‌ బిర్యానీ 
8) వెజ్‌ బిర్యానీ 

ఆర్డర్లలో టాప్‌–5 నగరాలు
1) బెంగళూరు 
2) ముంబై 
3) చెన్నై 
4) హైదరాబాద్‌ 
5) ఢిల్లీ  

మరిన్ని వార్తలు