కంటతడి పెట్టిస్తున్న జవాను వాట్సాప్‌ చాట్‌

27 Nov, 2020 16:46 IST|Sakshi

అమరుడయ్యే ఒకరోజు ముందు చిన్ననాటి స్నేహితుడితో సంభాషణ

సైనికుల జీవితాల్లో ఉన్న అనిశ్చితికి అద్దం పట్టిన మెసేజ్‌

నెట్టింట వైరల్‌ అవుతోన్న చాట్

శ్రీనగర్‌: ఎలా ఉన్నావన్న మిత్రుడితో ‘‘బాగానే ఉన్నా. కానీ మా (సైనికుల) గురించి ఎవరేం చెప్పగలరు? ఇవాళ ఉంటాం. రేపుండొచ్చు, ఉండకపోవచ్చు’’ అని సమాధానమిచ్చాడు ఒక ఇరవయ్యేళ్ల జవాను.  ఆ మరునాడే ఒక ఉగ్రదాడిలో అమరుడయ్యాడు. సైనికుల ప్రాణాలకు ఉన్న భరోసా ఏ పాటిదో చెప్తూ, సొంతూర్లోని తన చిన్ననాటి స్నేహితుడితో అతను చేసిన వాట్సాప్‌ చాట్‌ వైరల్‌గా మారడమే కాకుండా నెటిజన్లను కంటతడి పెట్టిస్తోంది.

ఎవరతను?
మహారాష్ట్ర, జల్‌గావ్‌ జిల్లా, చలిగావ్‌ తాలూకాకు చెందిన యశ్‌ దిగంబర్‌ దేశ్‌ముఖ్‌ గతేడాదే ఆర్మీలో చేరాడు. యశ్‌ తల్లిదండ్రులు వ్యవసాయదారులు. అతనికి ఇద్దరు అక్కలు, ఒక తమ్ముడు. అక్కలిద్దరికీ పెళ్లవగా, తమ్ముడింకా స్కూలుకు వెళుతున్నాడు. కర్ణాటక, బెళగావ్‌లో నిర్వహించిన మిలటరీ ఎంపిక శిబిరానికి చేరుకున్న యశ్‌ ఎంతగానో శ్రమించి ఆర్మీలో చోటు సంపాదించి తన కల నెరవేర్చుకున్నాడు.

అసలేమైంది?
అక్రమంగా ఎల్‌వోసీ దాటిన ముగ్గురు పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు గురువారం శ్రీనగర్‌లోని ఓ రద్దీ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ విధుల్లో ఉన్న సైనికులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. పట్టపగలే జరిగిన ఈ మెరుపుదాడిలో యశ్‌తో పాటు మరో జవాను అమరుడయ్యాడు. పన్నెండేళ్ల క్రితం ఇదే రోజున (26/11) ముంబై ఉగ్రదాడి జరగడం గమనార్హం. మరో రెండు రోజుల్లో జమ్ము కశ్మీర్‌లో ‘జిల్లా అభివృద్ధి మండలి’ (డీడీసీ) ఎన్నికలు జరనున్న నేపథ్యంలోనే ముష్కరులు ఈ దాడి జరిపి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. కాగా ఈ నెల 19న జమ్ము-శ్రీ నగర్‌ జాతీయ రహదారిపై ట్రక్కులో ప్రయాణిస్తున్న నలుగురు జైషే మొహమ్మద్‌ మిలిటంట్లను భారత భద్రతా బలగాలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే!

మరిన్ని వార్తలు