హిమాచల్‌ ప్రదేశ్‌లో వరదల బీభత్సం.. 22 మంది మృతి

20 Aug, 2022 21:06 IST|Sakshi

షిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కుండపోత వర్షాలతో నదులు ఉగ్రరూపం దాల్చాయి. ఆకస్మిక వరదలతో కొండచరియలు విరిగిపడటం ప్రమాదాల తీవ్రతను మరింత పెంచుతోంది. గత 24 గంటల్లో ఒకే కుటుంబంలో ఎనిమిది మందితో సహా దాదాపు 22 మంది మరణించారు, 9 మంది గాయపడ్డారు. మరో ఆరుగురు కనిపించకుండా పోయారు. వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉండే ఆ రోడ్డులో కొండ చరియలు విరిగిపడడం వల్ల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిలిచిపోయింది. ప్రస్తుతం రహదారిని క్లియర్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

కాంగ్రా, చంబా, బిలాస్‌పూర్, సిర్మౌర్, మండి జిల్లాలలో విస్తారంగా వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మండి జిల్లాలోని పాఠశాలలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. ఆగస్టు 25 వరకు హిమాచల్‌లో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ డైరెక్టర్‌ సుధేష్‌ కుమార్‌ వెల్లడించారు.

మండి వద్ద మనాలి-చండీగఢ్ జాతీయ రహదారి, షోఘిలోని సిమ్లా-చండీగత్ హైవే సహా 743 రోడ్లు ట్రాఫిక్ కారణంగా బ్లాక్ చేశారు. ఒక్క మండిలోనే భారీ వర్షాల కారణంగా సంభవించిన ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో 13 మంది మరణించగా, ఐదుగురు గల్లంతయ్యారని డిప్యూటీ కమిషనర్ అరిందమ్ చౌదరి తెలిపారు. ఇదిలా ఉండగా ఎడతెరిపి లేని వర్షాల కారణంగా కంగ్రా జిల్లాలో ఉన్న చక్కి బ్రిడ్జ్ శనివారం ఉదయం కూలిపోయిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు