ఒకే హాస్టల్లో 229 మందికి కరోనా

25 Feb, 2021 01:15 IST|Sakshi
కరోనా ఆంక్షల కారణంగా నిర్మానుష్యంగా మారిన మహారాష్ట్రలోని అమరావతి పట్టణం

మహారాష్ట్రలో బెంబేలెత్తిస్తోన్న కరోనా మహమ్మారి

సాక్షి ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి మళ్లీ ఉధృతరూపం దాల్చుతోంది. వాషీం జిల్లా రిసోడ్‌ తాలూకా దేగావ్‌లోని ఓ రెసిడెన్షియల్‌ పాఠశాలలో 229 మంది విద్యార్థులతోపాటు నలుగురు ఉపాధ్యాయులకు కరోనా సోకింది. దీంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. బుధవారం జిల్లా కలెక్టర్‌ శణ్ముగరాజన్‌ పాఠశాలను సందర్శించి అక్కడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పాఠశాల పరిసరాలను సీల్‌ చేసి, కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. కరోనా సోకిన విద్యార్థులంతా పాఠశాలకు సంబంధించిన హాస్టల్‌లో ఉంటున్నారు. మహారాష్ట్రలో బుధవారం 8,807 మందికి కరోనా సోకగా, 80 మంది మృతి చెందారు. ముంబైలో కరోనా రోగుల సంఖ్య వెయ్యి దాటింది. రాష్ట్రంలో మంగళవారం కరోనా రోగుల సంఖ్య 6,218 నమోదు కాగా బుధవారం ఏకంగా 8,807 నమోదైంది. మహారాష్ట్రలో ప్రస్తుతం 2,95,578 మంది హోం క్వారంటైన్‌లో ఉన్నారు.  

అలసత్వం వద్దు..
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడమే లక్ష్యంగా కఠినచర్యలను అమలు చేసే విషయంలో ఏమాత్రం అలసత్వం పనికిరాదని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఇప్పటికే కొన్ని దేశాల్లో బయటపడిన కొత్త రకం వైరస్‌ కారణంగా పరిస్థితి మరింత తీవ్రంగా మారే ప్రమాదం ఉందన్న నిజాన్ని గుర్తించాలని సూచించింది. కరోనా నివారణలో భాగంగా మహారాష్ట్ర, కేరళ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్, పంజాబ్, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, జమ్మూకశ్మీర్‌ రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించేందుకు ముగ్గురు చొప్పున సభ్యులుండే బృందాలను రంగంలోకి దించింది. వీరికి కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి హోదాలో పనిచేస్తున్న అధికారి నేతృత్వం వహిస్తున్నారు.

వివరణ ఇవ్వండి..
రోజువారీ కరోనా కేసులు పెరుగుతుండడం, ఆర్‌టీ–పీసీఆర్‌ టెస్టుల సంఖ్య తగ్గడంపై వివరణ ఇవ్వాలని మహారాష్ట్ర, కేరళ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్, పంజాబ్, జమ్మూకశ్మీర్‌ రాష్ట్రాలను ఆదేశిస్తూ కేంద్రం లేఖలు రాసింది.

నెగెటివ్‌గా తేలితేనే ఢిల్లీలోకి
సాక్షి, న్యూఢిల్లీ:  మహారాష్ట్ర, కేరళ, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, పంజాబ్‌ రాష్ట్రాల నుంచి దేశ రాజధాని ఢిల్లీకి వచ్చేవారు ఇకపై కరోనా నెగటివ్‌ ధ్రువపత్రం చూపించాల్సిందే. బస్సులు, రైళ్లు, విమానాల ద్వారా వచ్చేవారు కరోనా నెగెటివ్‌గా తేలితేనే ఢిల్లీలోకి అనుమతిస్తారు. ఈ కొత్త నిబంధనలను ఢిల్లీ ప్రభుత్వం శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. మార్చి 15 మధ్యాహ్నం వరకు కొనసాగుతాయని సమాచారం. ఐదు రాష్ట్రాల నుంచి వచ్చేవారు ఆర్‌టీ–పీసీఆర్‌ టెస్టు చేయించుకున్నట్లు, కరోనా నెగెటివ్‌గా తేలినట్లు ధ్రువపత్రం చూపించాల్సి ఉంటుంది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు