సిక్కింలో ఆకస్మిక వరదలు.. గల్లంతైన జవాన్లలో ముగ్గురి మృతదేహాలు లభ్యం

4 Oct, 2023 13:58 IST|Sakshi

Update: ఆకస్మిక వరదలు సిక్కిం రాష్ట్రాన్ని అల్లాడించాయి. కుండపోత వాన, వరదతో రెండు జిల్లాలు అల్లకల్లోలంగా మారాయి. గల్లంతైన 23 మంది జవాన్లలో ముగ్గురి మృతదేహాలను సహాయక సిబ్బది గుర్తించింది.  మిగిలిన వారికోసం రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది,

ఈశాన్య రాష్ట్రం సిక్కింలో ఒక్కసారిగా భారీ వరదలు ముంచెత్తాయి. లాచెన్‌లోయలో మంగళవారం రాత్రి ​కురిసిన కుండపోత వర్షానికి తీస్తానదిలో అకస్మాత్తుగా వరద ఉద్ధృతి పెరిగింది. దీంతో అక్కడి ఆర్మీ శిబిరాలపై వరదల ప్రభావం పడింది. ఊహించని రీతిలో వరదలు పోటెత్తడంతో 23 మంది భారత జవాన్లు గల్లంతైనట్లు రక్షణశాఖ వెల్లడించింది. ఆర్మీ అధికారుల వాహనాలు కూడా వరద ఉద్ధృతికి కొట్టుకుపోయినట్లు పేర్కొంది.  
 

ఉత్తర సిక్కింలోని లొనాక్ సరస్సు పరివాహాక ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ వల్ల తీస్తా నది నీటిమట్టం ఒక్కసారిగా పెరగడంతో ఈ వరద ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు చుంగ్తాంగ్ డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయడం వల్ల పరిస్థితి మరింత తీవ్రమైనదిగా మారింది. దీనివల్ల దిగువకు 15 నుంచి 20 అడుగుల ఎత్తు వరకు నీటి మట్టం పెరిగింది. దీంతో అర్ధరాత్రి సమయంలోఈ  అకస్మిక వరదలు సంభవించాయి.

ఆకస్మిక వరద లాచెన్ లోయలో ఉన్న ఆర్మీపోస్టులకు కూడా నష్టం కలిగించింది. సింగ్తమ్‌ సమీపంలోని బర్దంగ్ వద్ద పార్క్ చేసిన ఆర్మీ వాహనాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. వరద తీవ్రతకు 23 మంది సిబ్బంది గల్లంతైనట్లు ఈస్ట్రన్‌ కమాండ్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది. గల్లంతైన సిబ్బంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపింది.

తీస్తా నది పొంగి ప్రవహించడంతో సింగ్తమ్‌ ఫుట్ బ్రిడ్జి కూలిపోయింది. పశ్చిమ బెంగాల్‌ను సిక్కింను కలిపే 10వ నెంబర్‌ జాతీయ రహదారి పలు చోట్లకొట్టుకుపోయింది.  ఆకస్మిక వరదల నేపథ్యంలో చాలా రోడ్లు, రహదారులు  దెబ్బతిన్నాయి. అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. 

మరిన్ని వార్తలు