శ్మశానంలో ప్రమాదం.. 23 మంది మృతి

4 Jan, 2021 05:39 IST|Sakshi
ఘటనా స్థలిలో శిథిలాలను తొలగిస్తున్న అధికార యంత్రాంగం

ఢిల్లీ శివారు ఘజియాబాద్‌లో ఘటన

బాధితులంతా అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వచ్చిన వారే

ఘజియాబాద్‌: బంధువు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు శ్మశానవాటికకు వెళ్లిన 23 మందిని మృత్యువు కబళించింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. మురాద్‌నగర్‌లోని ఉఖ్లార్సికి చెందిన జైరామ్‌ అంత్యక్రియలు స్థానిక శ్మశానవాటికలో జరుగుతున్నాయి. అదే సమయంలో వర్షం ప్రారంభం కావడంతో హాజరైన చాలామంది అక్కడే ఉన్న భవనంలోకి చేరుకున్నారు. అకస్మాత్తుగా భవనం పైకప్పు కూలి వారిపై పడింది. దీంతో అక్కడికక్కడే 23 మంది చనిపోగా మరో 15 మంది గాయపడ్డారు. పోలీసులు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నాయి.

డాగ్‌స్క్వాడ్‌ సాయంతో శిథిలాల్లో చిక్కుకుపోయిన వారిని గుర్తించి వెలికితీశారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ఆదివారం సాయంత్రం వరకు మృతుల్లో 18 మందిని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ఉత్తరప్రదేశ్‌ సీఎం ఆదిత్యనాథ్‌ రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. ఇటీవలే నిర్మించిన ఈ కట్టడం కూలి, అనూహ్యంగా ప్రాణ నష్టం సంభవించడంపై సీఎం పూర్తి స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు.  

మృతదేహాలను తరలిస్తున్న దృశ్యం

మరిన్ని వార్తలు