Sudan Crisis: సూడాన్‌ టూ భారత్‌.. ఆనందంలో బాధితులు..

29 Apr, 2023 11:45 IST|Sakshi

న్యూఢిల్లీ: సూడాన్‌ నుంచి భారతీయుల్ని స్వదేశానికి రప్పించే ‘ఆపరేషన్‌ కావేరి’ వేగవంతంగా సాగుతోంది. ఈ క్రమంలో భారతీయులు స్వదేశం చేరుకున్నారు. కేంద్రం భారత వాయుసేన, నావికా దళాల ద్వారా భారతీయులను సురక్షితంగా స్వదేశానికి చేరుస్తున్నది.

 కాగా, ఆపరేషన్‌ కావేరిలో​ భాగంగా సూడాన్‌ నుంచి దాదాపు ఆరువేల మంది భారతీయులు స్వదేశం చేరుకున్నట్టు తెలుస్తోంది. ముందుగా భారతీయులను సూడాన్‌లోని సురక్షిత ప్రాంతాలకు తరలించి అక్కడి నుంచి భారత్‌కు చేరుస్తున్నది. ఇప్పటికే పలువురు స్వదేశానికి వచ్చేయగా తాజాగా మరో 231 మంది వాయు మార్గంలో ఢిల్లీకి చేరుకున్నారు. దీంతో భారత్‌ చేరుకున్న వారి సంఖ్య 6వేలకు చేరుకుంది. 

ఇదిలా ఉండగా.. గురువారం రాత్రి వందకు పైగా మందిని తరలించే క్రమంలో తెగువ ప్రదర్శించారు ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ పైలట్లు. జెడ్డాకు చేరుకునే క్రమంలో పోర్ట్‌ ఆఫ్‌ సూడాన్‌కు 121 మందితో కూడిన భారతీయ పౌరుల బృందం చేరుకోవాల్సి ఉంది. అయితే.. చేరుకునే మార్గం లేక వాడి సయ్యద్నా చిక్కుకుపోయారు. ఈ సమాచారం అందుకున్న ఏఐఎఫ్‌ రంగంలోకి దిగింది. వాళ్లను తరలించేందుకు C-130J హెర్క్యులస్‌తో బయల్దేరింది. అయితే.. వాడి సయ్యద్నాలో ఉన్న చిన్న ఎయిర్‌స్ట్రిప్‌లో ల్యాండింగ్‌కు అనుకూలంగా లేని పరిస్థితి. దీంతో.. పైలట్లు సమయస్ఫూర్తి ప్రదర్శించారు. నైట్‌ విజన్‌ గాగుల్స్‌ సాయంతో ఏమాత్రం తప్పిదం లేకుండా ఎయిర్‌ఫోర్స్‌ పైలెట్లు ఎయిర్‌క్రాఫ్ట్‌ను చాకచక్యంగా ల్యాండ్‌ చేశారు. 

ఇది కూడా చదవండి: సరిహద్దులో సాధారణ స్థిరత్వం: చైనా విదేశాంగ మంత్రి

>
మరిన్ని వార్తలు