భోపాల్‌లో రెస్టారెంట్లు, లాంజ్‌లు, బార్లపై దాడులు

15 Feb, 2021 18:59 IST|Sakshi

భోపాల్‌: ప్రేమికుల దినోత్సవం రోజు వచ్చిందంటే ప్రేమికులతో పాటు మరికొందరు గుర్తొస్తారు. వారే పాశ్చాత్య సంస్కృతి అంటూ వాలంటైన్స్‌ డే నిర్వహించుకోవద్దని చెబుతూ హిందూ సంఘాలు విజ్ఞప్తి చేస్తాయి. అయితే దాన్ని పట్టించుకోకుండా ఫిబ్రవరి 14 రోజులు ప్రేమికులు ఎక్కడైనా కనిపిస్తే వారికి పెళ్లి చేస్తామని హెచ్చరించే విషయం తెలిసిందే. అయితే ఈసారి కూడా ప్రేమికుల రోజు బీభత్సం జరిగింది. పలు చోట్ల దాడులకు పాల్పడడంతో ఓ మాజీ ఎమ్మెల్యేతో పాటు మొత్తం 23 మందిపై కేసు నమోదు చేసిన ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది.

వాలంటైన్స్ డే రోజు శుక్రవారం భోపాల్‌లోని శ్యామల హిల్స్ ప్రాంతంలో బీజేపీ యూత్ వింగ్ కార్యకర్తలు బీభత్సం సృష్టించారు. అక్కడ ఉన్న హుక్కా బార్ లాంజ్‌ ఆస్తులపై కర్రలతో దాడి చేసి ధ్వంసం చేశారు. ఈ ఘటనలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే సురేంద్రనాథ్‌పై కేసు నమోదు చేశారు. భోపాల్‌లోని అరేరా కాలనీ ప్రాంతంలో ఉన్న రెస్టారెంట్‌పై శివసేన కార్యకర్తలు దాడి చేశారు. అయితే ఈ దాడిలో ముగ్గురు మహిళలు కూడా పాల్గొనడం విశేషం. శ్యామల హిల్స్ ప్రాంతంలో దాడులకు పాల్పడి విధ్వంసం సృష్టించిన వారిపై హబీబ్‌గంజ్ పోలీసులు కేసులు నమోదు చేశారు.

హుక్కా బార్లను, లాంజ్‌లపై మాజీ ఎమ్మెల్యే సురేంద్ర నాథ్ వ్యతిరేకతను ప్రదర్శించారు. భోపాల్‌లో వివిధ ప్రాంతాల్లో హుక్కా బార్లను, లాంజ్‌లను మూసివేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ‘యువతులకు డ్రగ్స్ అందిస్తున్న, లవ్ జిహాద్‌కు ప్రోత్సహితస్తున్న హుక్కా బార్లకు ఇది ఒక ప్రారంభ హెచ్చరిక మాత్రమే’ అని బీజేవైఎం నాయకుడు అమిత్ రాథోడ్ చెప్పారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే సురేంద్రనాథ్‌తో పాటు ఏడుగురిని అరెస్ట్ చేసినట్టు జోన్-3 అదనపు ఎస్పీ రామ్ సనేహి మిశ్రా తెలిపారు. వాలెంటైన్స్ డే రోజు చోటుచేసుకున్న రెండు ఘటనలకు సంబంధించి హబీబ్‌గంజ్, శ్యామలహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లలో వేర్వేరుగా కేసులు నమోదయ్యాయి. భోపాల్‌లో బీభత్సం సృష్టించిన ఘటనలో మొత్తం 23కేసులు నమోదయ్యాయని పోలీస్‌ వర్గాలు తెలిపాయి.
 

>
మరిన్ని వార్తలు