పంజాబ్‌లో ఆప్‌తో రైతు సంఘాల జట్టు

25 Dec, 2021 05:53 IST|Sakshi

చండీగఢ్‌: పంజాబ్‌ అసెంబ్లీకి మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్న సమయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రానున్న ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీతో కలిసి పోటీ చేయనున్నట్లు సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కేఎం)లో భాగంగా ఉన్న 25 రైతు సంఘాలు ప్రకటించాయి. కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఎస్‌కేఎం నేతృత్వంలో రైతు సంఘాలు ఏడాదిపాటు ఆందోళనలు కొనసాగించిన విషయం తెలిసిందే. శుక్రవారం సాయంత్రం లూథియానాలో జరిగిన సమావేశంలో ఎస్‌కేఎంలోని 32 రైతు సంఘాలకు 7 సంఘాలు ఎన్నికలకు దూరంగా ఉంటామని స్పష్టం చేశాయి. అదేవిధంగా, ఎన్నికల్లో ఎస్‌కేఎం పేరును వాడుకోరాదని మిగతా సంఘాలను కోరాయి.

రాజకీయాల్లోకి ప్రవేశించాలనుకుంటున్న 25 రైతు సంఘాలు తమ నిర్ణయాన్ని శనివారం అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి. ఎన్నికలకు దూరంగా ఉండే సంఘాలు.. కీర్తి కిసాన్‌ యూనియన్, క్రాంతి కారీ కిసాన్‌ యూనియన్, బీకేయూ క్రాంతికారీ, బీకేయూ సింధుపూర్, దోఆబా సంఘర్‌‡్ష కమిటీ, జై కిసాన్‌ ఆందోళన్‌. ఎన్నికల బరిలో దిగాలనుకుంటున్న సంఘాల్లో సుమారు 12 వరకు ఆప్‌తో కూటమిగా ఏర్పడేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. పంజాబ్‌ రైతుల ఆందోళనలకు ఆప్‌ మొదట్నుంచీ మద్దతు పలుకుతున్న విషయం తెలిసిందే. రైతు నేతలైన బల్బీర్‌ సింగ్‌ రాజేవాల్, హర్మీత్‌ సింగ్‌ కదియాన్‌లు ఆప్‌ టికెట్‌పై పోటీ చేయనున్నారంటూ ఊహాగానాలు వచ్చాయి. 

మరిన్ని వార్తలు