మేం వచ్చేశాం

1 Mar, 2022 04:53 IST|Sakshi
సోమవారం ఉక్రెయిన్‌ నుంచి ఢిల్లీ విమానాశ్రయం చేరుకున్న విద్యార్థులు

ఉక్రెయిన్‌ నుంచి ఢిల్లీకి మరో 25 మంది విద్యార్థులు

సాక్షి, న్యూఢిల్లీ, ముంబై/శంషాబాద్‌: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు విడతలవారీగా స్వదేశానికి చేరుకుంటున్నారు. సోమవారం ఉదయం ప్రత్యేక విమానాలలో రొమేనియా రాజధాని బుకారెస్ట్‌ నుంచి రాష్ట్రంలోని హైదరాబాద్, రంగారెడ్డి, సూర్యాపేట జిల్లాలకు చెందిన 11 మందితోపాటు ఏపీకి చెందిన మరో 11 మంది ఢిల్లీకి చేరుకున్నారు.

అలాగే సోమవారం సాయంత్రం తెలంగాణకు చెందిన మరో ముగ్గురు విద్యార్థులు హంగేరీ రాజధాని బుడాపెస్ట్‌ నుంచి ఢిల్లీకి వచ్చారు. వారికి ఏపీ, తెలంగాణ భవన్‌ ఉద్యోగులు వసతి, భోజన, రవాణా సదుపాయాలు అందించారు. వీరు ఢిల్లీ నుంచి సోమవారం రాత్రి 9 గంటలకు హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. మరోవైపు మంగళవారం ఉదయం 6:30 గంటలకు ముంబై చేరుకోనున్న మరో విమానంలోనూ పదుల సంఖ్యలో తెలుగు విద్యార్థులు ఉన్నట్లు తెలంగాణ ఐఏఎస్‌ అధికారి ఎ. శరత్, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ నోడల్‌ అధికారి వి. రామకృష్ణ ‘సాక్షి’కి తెలిపారు. 

రెండు నెలల్లో ఎంబీబీఎస్‌ పూర్తయ్యేది
మరో రెండు నెలల్లో నా ఎంబీబీఎస్‌ కోర్సు పూర్తయ్యేది. కానీ ఈ యుద్ధం కారణంగా అన్నీ వదిలేసి తిరిగి రావాల్సి వచ్చింది. అక్కడ పరిస్థితులు చక్కబడిన తర్వాత కోర్సుకు సంబంధించి యూనివర్సిటీ ఏం నిర్ణయం తీసుకుంటుందో ఎదురుచూడాల్సిందే.
– సుధేశ్‌ మోహన్‌ నట్ల, ఒంగోలు 

సరిహద్దులో రెండు రోజులు 
మేము టికెట్‌ బుక్‌ చేసుకున్నా విమానాలు లేకపోవడంతో స్నేహితులందరం తొలుత ఉక్రెయిన్‌ సరిహద్దుకు చేరుకున్నాం. అక్కడ రెండు రోజులపాటు మమ్మల్ని రొమేనియాలోకి వెళ్లనీయకుండా సైనికులు అడ్డుకున్నారు.  చివరకు సరిహద్దు దాటాక భారత రాయబార అధికారులు మమల్ని ఢిల్లీకి తీసుకొచ్చారు. ఉక్రెయిన్‌లో మన వాళ్లు ఇంకా చాలా మంది ఉన్నారు.   
 
–నిషారాణి (ఎంబీబీఎస్‌ నాలుగో సంవత్సరం) శంషాబాద్‌ 

ఎంబీబీఎస్‌ నాలుగో సంవత్సరం చదువుతున్నా. యుద్ధం కారణంగా మా యూనివర్సిటీలో వాళ్లందరం తొలుత ఎంతో కష్టపడి ఉక్రెయిన్‌ సరిహద్దుకు చేరుకున్నాం. కానీ అక్కడి భద్రతా దళాలు ఉక్రెయినియన్లకే మొదటగా దేశం వదిలి వెళ్లేందుకు అనుమతి ఇస్తున్నాయి. దీంతో సరిహద్దు దాటడానికి మాకు ఒకటిన్నర రోజులు పట్టింది. ఇంకా చాలా మంది భారతీయులు తిరిగి వచ్చేందుకు ఎదురుచూస్తున్నారు. 
 
– విష్ణు, సూర్యాపేట 

మరిన్ని వార్తలు