2nd Wave స్వతంత్ర భారతంలో అత్యంత ఘోర మానవ విషాదం: రిపోర్టు

21 Jul, 2021 21:01 IST|Sakshi

అధికారిక లెక్కలతో పోలిస్తే..వందలు  వేలు కాదు, లక్షలు ఎక్కువ

మొదటి వేవ్‌  ప్రమాదాన్ని గుర్తించడంలో వైఫల్యంతోనే  సెకండ్‌ వేవ్‌ 

సెకండ్‌వేవ్‌లో మరణాల సంఖ్య  సుమారు  50 లక్షలు

సాక్షి, న్యూఢిల్లీ:  దేశంలో కరోనా మహమ్మారి సెకండ్‌వేవ్‌  సృష్టించిన కల్లోలం అంతా ఇంకా కాదు.  రికార్డు స్తాయిలో రోజుల వారీ 4 లక్షలకు పైగా  కేసులతో,  4 వేలకు పైగా మరణాలతో పెను విపత్తును మరిపించింది. మందులకొరత,  బెడ్ల కొరత, ఆక్సిజన్‌ దొరక్క బాధితుల బాధలు అన్నీ ఇన్నీ కావు. అయితే అధికారిక లెక్కలతో పోలిస్తే దాదాపు రెట్టింపు మరణాలను ప్రభుత్వం దాచిపెట్టిందన్న తీవ్ర విమర్శల మధ్య షాకింగ్‌ రిపోర్ట్‌ వెలుగులోకి వచ్చింది. నిజమైన మరణాలు వందల వేలు కాదు అనేక లక్షలు ఎక్కువ అని.. స్వాతంత్ర్యం తరువాత దేశంలో ఇదే అత్యంత ఘోరమైన మానవ విషాదమని వ్యాఖ్యానించింది.

దేశ విభజన తరువాత భారతదేశంలో జరిగిన అత్యంత ఘోరమైన విషాదం మరొకటి లేదని  సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్‌మెంట్ తయారుచేసిన ఒక నివేదిక పేర్కొంది.  జూన్ 2021 నాటికి భారత అధికారిక కోవిడ్-19 మరణాల సంఖ్య 4 లక్షలుగా ఉండగా వాస్తవానికి, విపత్తుగా అధ్వాన్నంగా ఉందని వ్యాఖ్యానించింది. అధికారిక లెక్క లకంటే  49 లక్షల అదనపు మరణాలు సంభవించాయని తెలిపింది. 2020 జనవరి  2021 జూన్ మధ్య దాదాపు 50 లక్షలు (4.9 మిలియన్లు) మంది మరణించి ఉండవచ్చని నివేదిక అంచనా వేసింది. మొదటి వేవ్‌ కాలంలో 20 లక్షలమంది మరణించి ఉండవచ్చని కూడా తెలిపింది. ఫస్ట్‌వేవ్‌  ఉధృతిని, విషాదాన్ని, గుర్తించడంలో  వైఫల్యమే సెకండ్‌ వేవ్‌ బీభత్సానికి దారితీసిందని అని నివేదిక పేర్కొంది.

వాషింగ్టన్ ఆధారిత థింక్ ట్యాంక్ సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్‌మెంట్  దీన్ని తయారు చేసింది. అంతేకాదు భారత మాజీ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అరవింద్ సుబ్రమణియన్ సహ రచయితగా  వ్యవహరించిడం విశేషం. హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన అభిషేక్ ఆనంద్, సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్‌మెంట్‌కు చెందిన జస్టిన్ సాండేఫర్ ఈ నివేదికను రూపొందించారు. సెరోలాజికల్ అధ్యయనాలు, గృహ సర్వేలు, రాష్ట్ర స్థాయి పౌర సంస్థల అధికారిక సమాచారం,  అంతర్జాతీయ అంచనాల ఆధారంగా, వాషింగ్టన్ ఆధారిత గ్లోబల్ డెవలప్‌మెంట్ సెంటర్ దేశంలో మంగళవారం మూడు అంచనాలతో విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలను పేర్కొంది. కచ్చితమైన కోవిడ్‌ మరణాలను అంచనా వేయడం కష్టమే అని అంగీకరించినప్పటికీ అధికారిక  లెక్కలతో పోలిస్తే  వాస్తవ మరణాలు చాలా ఎక్కువ అని  తెలిపింది. 

మరిన్ని వార్తలు