కరోనా వాక్సిన్ :  ప్రధాని మోదీ గుడ్ న్యూస్ 

15 Aug, 2020 09:39 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఎర్రకోట వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. కరోనా వైరస్  నివారణకు సంబంధించి మూడు వ్యాక్సిన్లు వివిధ దశల పరీక్షల్లో ఉన్నాయని, శాస్త్రవేత్తలు ఆమోదం, అనుమతి లభించి వెంటనే ప్రతి భారతీయుడికి లభించేలా ఉత్పత్తి, పంపిణీ ప్రణాళికతో ఉన్నామనీ, దానికోసం రోడ్‌మ్యాప్ సిద్ధంగా ఉందని ప్రధాని ప్రకటించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో పనిచేస్తున్న వారియర్స్‌కు శిరస్సు వంచి సలాం చేస్తున్నానంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ దేశ ప్రజలకు ఈ శుభవార్త అందించారు.  

దేశానికి సేవ చేయడానికి అవిశ్రాంతంగా కృషి చేసిన ఆరోగ్య కార్యకర్తలు, వైద్యులు, నర్సులు ,ఇతర కరోనా యోధులకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఒక విపత్కర సమయంలో ఉన్నాం. ఈ మహమ్మారి కారణంగా తాను పిల్లలను ఎర్రకోటవద్ద చూడలేకపోతున్నానని పేర్కొన్నారు. ఈ సంక్షోభానికి చాలా కుటుంబాలు ప్రభావితమయ్యాయి, చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అయితే 130 కోట్ల మంది భారతీయుల సంకల్పంతో,  ఈ మహమ్మారిని ఓడిస్తామని ప్రధాని మోదీ అన్నారు. (జెండా పండుగ : బోసిపోయిన చిన్నారులు)

అలాగే నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్‌ను త్వరలో ప్రకటించనున్నట్లు ప్రధాని ఈ సందర్భంగా వెల్లడించారు.దేశవ్యాప్తంగా ప్రతి పౌరుడి ఆరోగ్య రికార్డులను డిజిటల్‌ రూపంలో భద్రపరిచేలా ఓ యూనిక్‌ ఐడీని తీసుకొస్తున్నామని చెప్పారు. ఒక దేశం ఒక ఆరోగ్య కార్డు పధకంలో భాగంగా ఆధార్‌ కార్డు తరహాలో హెల్త్‌ కార్డు జారీ చేయనున్నామని చెప్పారు. దీంతో సంబంధిత వ్యక్తి చికిత్సలు, పరీక్షలు సహా వైద్య చరిత్ర అంతా డిజిటల్ రూపంలో ఈ కార్డులో భద్రపరుస్తామన్నారు. ఫలితంగా దేశంలో ఆస్పత్రిని సందర్శించే వ్యక్తి తన వెంట వైద్య పరీక్షల రిపోర్టులు, ప్రిస్క్రిప్షన్లు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉండదని ఆయన వివరించారు. దశలవారీగా అమలు చేయనున్న ఈ పధకానికి 300 కోట్ల రూపాయలను కేటాయించినట్టు ప్రధాని తెలిపారు. 

మరిన్ని వార్తలు