మరో 674 మంది స్వదేశానికి..

12 Mar, 2022 03:50 IST|Sakshi
శుక్రవారం ఢిల్లీ విమానాశ్రయంలో విద్యార్థులు, తల్లిదండ్రుల భావోద్వేగాలు

మూడు విమానాల్లో భారత్‌కు చేరుకున్న ‘సుమీ’ విద్యార్థులు

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఉద్వేగభరిత దృశ్యాలు

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లోని సుమీ నగరంలో చిక్కుకున్న భారత వైద్య విద్యార్థులను ‘ఆపరేషన్‌ గంగ’లో భాగంగా అధికారులు శుక్రవారం స్వదేశానికి తరలించారు. సుమీ నుంచి పోలండ్‌కు చేరుకున్న 674 మందిని మూడు ప్రత్యేక విమానాల్లో ఢిల్లీకి తీసుకొచ్చారు. మొదట ఎయిర్‌ ఇండియా విమానం 240 మంది విద్యార్థులతో ఉదయం 5.45 గంటలకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. 221 మందితో ఇండిగో విమానం మధ్యాహ్నం 12.20 గంటలకు ఢిల్లీకి చేరింది. భారత వైమానికి దళానికి(ఐఏఎఫ్‌) చెందిన మూడో విమానం 213 మంది విద్యార్థులతో మధ్యాహ్నం 12.15 గంటలకు ఢిల్లీలోని హిండాన్‌ ఎయిర్‌బేస్‌కు చేరుకుంది. సి–17 సైనిక రవాణా విమానంలో విద్యార్థులను ఢిల్లీకి చేర్చినట్లు అధికారులు తెలిపారు.

ప్రాణాలతో బయటపడడం ఒక అద్భుతమే
రష్యా సైనిక దాడులతో దద్దరిల్లుతున్న సుమీ నగరం నుంచి క్షేమంగా బయటపడడం నిజంగా ఒక అద్భుతమేనని భారత వైద్య విద్యార్థులు చెప్పారు. ‘ఆపరేషన్‌ గంగ’లో భాగంగా వారు ప్రత్యేక విమానాల్లో శుక్రవారం ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో భావోద్వేగపూరిత దృశ్యాలు కనిపించాయి. సుమీ నుంచి వచ్చిన విద్యార్థులు తమ తల్లిదండ్రులను, బంధువులను ఆలింగనం చేసుకొని, కన్నీరు పెట్టుకున్నారు. తల్లిదండ్రులు తమ బిడ్డల మెడలో పూలమాలలు వేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భారత్‌ మాతాకీ జై అంటూ బిగ్గరగా నినాదాలు చేశారు.

ఎయిర్‌పోర్టులో తన తల్లిదండ్రులను కళ్లారా చూడడం చాలా ఆనందంగా ఉందని ధీరజ్‌ కుమార్‌ అనే విద్యార్థి తెలిపాడు. యుద్ధభూమి నుంచి తాము ప్రాణాలతో స్వదేశానికి తిరిగిరావడం ఒక భయానక అనుభవమేనని పేర్కొన్నాడు. మార్గమధ్యంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని చెప్పాడు. సుమీలో సైరన్లు వినిపించినప్పుడల్లా వెంటనే బంకర్లకు చేరుకొనేవాళ్లమని ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌కు చెందిన వైద్య విద్యార్థిని మహిమా వెల్లడించింది. భారత్‌కు తిరిగి వస్తామో లేదోనన్న భయాందోళన ఉండేదని తెలిపింది. స్వదేశానికి వచ్చిన తర్వాత ప్రాణాలు తిరిగొచ్చినట్లుగా ఉందని, ఇప్పుడే హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నామని పేర్కొంది.

సహకరించిన దేశాలకు ఎస్‌.జైశంకర్‌ కృతజ్ఞతలు
ఉక్రెయిన్‌ నుంచి తమ విద్యార్థుల తరలింపునకు సహకరించిన ఉక్రెయిన్, రష్యా ప్రభుత్వాలకు, రెడ్‌ క్రాస్‌కు భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా సుమీ నగరం నుంచి విద్యార్థుల తరలింపు ప్రక్రియ పెనుసవాలు విసిరిందని శుక్రవారం ట్విట్టర్‌లో వెల్లడించారు. ‘ఆపరేషన్‌ గంగ’లో భాగంగా భారత విద్యార్థులను క్షేమంగా వెనక్కితీసుకురావడంలో ఉక్రెయిన్‌ పొరుగు దేశాలైన రొమేనియా, హంగేరి, పోలండ్, స్లొవేకియా, మాల్డోవా ఎంతగానో సహకరించాయని, ఆయా దేశాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌ నుంచి ఇప్పటిదాకా దాదాపు 18,000 మంది భారతీయులను కేంద్రం స్వదేశానికి తీసుకొచ్చింది.

మరిన్ని వార్తలు