ప్రధాని కార్యాలయ అధికారిగా బురిడీ కొట్టించి..చివరికి పోలీసులకు చిక్కి..

17 Mar, 2023 17:27 IST|Sakshi

ముగ్గురు వ్యక్తులు ప్రధానమంత్రి కార్యాలయానికి చెందిన అధికారనంటూ ఫోజులిస్తూ జమ్ముకాశ్మీర్‌ యంత్రాంగాన్ని మోసగించారు. ఈ మేరకు గుజరాత్‌కి చెందిన కిరణ్‌ భాయ్‌ పటేల్‌ నేతృత్వంలోని బృందంలో ముగ్గురు వ్యక్తులు పీఎంఓ అధికారులుగా నటిస్తూ.. జమ్మూకాశ్మీర్‌లో పర్యటించి, బుల్లెట్‌ ప్రూఫ్‌ మహింద్రా స్కార్పియో కార్లలో తిరుగుతూ ఫైవ్‌ స్టార్‌ హోటళ్లలో అతిధ్యం అందుకున్నారు. వారి చేతిలో మోసపోయిన జమ్ము కాశ్మీర్‌ అధికారులు వారికి సకల రాచమర్యాదలు అందించారు. గతేడాది నుంచి ఈ ప్రధానమంత్రి కార్యాలయానికి సంబంధించిన బృందం కశ్మీర్‌లో పర్యటిస్తుంది. అదికూడా రెండు వారాల వ్యవధిలోనే రెండోసారి పర్యటనకు రావడంతో అనుమానం తలెత్తి.. భద్రతా అధికారులు సీఐడీకి సమాచారం అందించారు.

కిరణ్‌ భాయ్‌ పటేల్‌ తోపాటు ఉన్న మిగతా ముగ్గురు వ్యక్తులను గుజరాత్‌కు చెందిన అమిత్‌ హితేష్‌ పాండియా, జే సితాపరా, రాజస్థాన్‌కి చెందిన త్రిలోక్‌ సింగ్‌లుగా గుర్తించారు. వీరంతా పీంఎంఓ బృందంగా నటిస్తూ.. గతుడాది అక్టోబర్‌ నుంచి కాశ్మీర్‌లో నాలుగు సార్లు పర్యటించారు. అధికారిక వర్గాల ప్రకారం..దక్షిణ కాశ్మీర్‌లో జిల్లా మేజిస్ట్రేట్‌గా ఉన్న ఒక ఐఏఎస్‌ అధికారి సదరు సీనియర్‌ పీఎంఓ అధికారి సందర్శన ​గురించి పోలీసుల భద్రతా విభాగానికి సమాచారం అందించినట్లు అధికారికి వర్గాలు తెలిపాయి. దీంతో భద్రతా విభాగం నిందితుడు పటేల్‌కు జెడ్‌ ప్లస్‌ భద్రతలను అందించడమే గాక అక్టోబర్‌ నుంచి నాలుగు పర్యటనల్లో అతను ఎక్కడికి వెళ్లినా వీఐపీ హోదాగా వెంట స్థానిక పోలీసులు కూడా వచ్చారు. సదరు మోసగాడు కిరణ్‌ భాయ్‌ పటేల్‌ అక్కడ అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించి, నియంత్రణ రేఖ సమీపంలోని ఉరిలోని కమాన్‌ పోస్ట్‌ నుంచి శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌కు వరకు పర్యటించాడు.

అందుకు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్‌లో పంచుకున్నాడు. అంతేగాదు అక్కడ  దూద్‌పత్రిని ప్రధాన పర్యాటక కేంద్రంగా మార్చడంపై చర్చించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. నిందితుడు పటేల్‌ తొలిసారిగా అక్టోబర్‌ 27న తన కుటుంబంతో సహా పర్యాటనకు వచ్చాడని ఆ తర్వాత పర్యటనలో ఈ ముగ్గురు వ్యక్తులు చేరినట్లు తెలిపారు. గట్టి నిఘాపెట్టిన సీఐడీ వర్గాలు అతడి గత చరిత్రను ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. దీంతో ఆ వ్యక్తిని చాలా పకడ్బంధింగా అరెస్టు చేశారు. ఐతే పటేల్‌ అరెస్టు కావడానికి కొద్ది నిమిషాల ముందు మిగతా ముగ్గురు వ్యక్తులు తప్పించుకున్నట్లు అధికారులు తెలిపారు. వారికి సహకరించిన ఇద్దరు పోలీసులపై కూడా చర్యలు తీసుకున్నారు. కాగా, నిందితుడు పటేల్‌ని దర్యాప్తు చేసేందుకు గుజరాత్‌ పోలీసులు కూడా రంగంలోకి దిగినట్లు తెలిపారు. 

(చదవండి: పనిలోంచి తీసేశారని క్లీనర్‌ రివేంజ్‌..కార్లపై యాసిడ్‌ పోసి..)

మరిన్ని వార్తలు