జమ్మూ కశ్మీర్‌లో భారీ ఎన్‌ కౌంటర్‌.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

28 Dec, 2022 09:34 IST|Sakshi

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని సిధ్రాలో బుధవారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను భారత జవాన్లు మట్టుబెట్టారు. సంజ్‌తీర్థి- సిధ్రా రహదారిపై వెళ్తున్న ట్రక్కులో ఉగ్రవాదులు దాక్కున్నారని జమ్మూకశ్మీర్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు భద్రతా బలగాలను రంగంలోకి దింపాయి. ట్రక్కను అడ్డుకొని తనిఖీలు చేస్తుండగా డ్రైవర్‌ పారిపోగా.. అందులో దాక్కున్న ఉగ్రవాదులు సిబ్బందిపై కాల్పులు జరిపారు.

వెంటనే సైనిక  బలగాలు టెర్రరిస్టులపై ఎదురుకాల్పులు జరిపాయి. ఉదయం 7.30 గంటలకు కాల్పులు జరిగాయని, ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారని అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ముఖేష్ సింగ్ తెలిపారు. ఎన్ కౌంటర్ స్థలంలో నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)కి చెందిన ఒక కోడెడ్ షీట్, ఒక లెటర్ ప్యాడ్ పేజీ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా జమ్మూ కాశ్మీర్‌లోని ఉదంపూర్ జిల్లాలో 15 కిలోల ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్‌ను(ఐఈడీ)బలగాలు పసిగట్టి నిర్వీర్యం చేసిన తర్వాత ఎన్‌కౌంటర్ జరిగింది.
చదవండి: చేదు మిగిల్చిన షుగర్‌ వ్యాధి.. వేదన చూడలేక కుటుంబమంతా..

మరిన్ని వార్తలు