30 కోట్లు దాటిన వ్యాక్సినేషన్‌

24 Jun, 2021 05:44 IST|Sakshi

గత 24 గంటల్లో 50,848 కొత్త కేసులు నమోదు 

3 కోట్లు దాటిన మొత్తం కేసులు 

96.56 శాతానికి పెరిగిన రికవరీ రేటు  

పాజిటివిటీ రేటు 2.67 శాతం

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో భారత్‌ మరో మైలరాయి దాటింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం రాత్రి విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న 39,49,630 శిబిరాల ద్వారా ఇప్పటిదాకా మొత్తం  30,09,69,538 వ్యాక్సిన్‌ డోసుల పంపిణీ జరగగా, గత 24 గంటలలోనే 63.26లక్షల వ్యాక్సిన్లు ఇచ్చారు. అదే సమయంలో గత 24 గంటలలో దేశవ్యాప్తంగా  50,848 కరోనా పాజిటివ్‌ కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటిదాకా కరోనా బారినపడిన వారి సంఖ్య మూడు కోట్లు (3,00,28,709) దాటింది.

గత ఏడాది డిసెంబరు 19న కోటి దాటిన కరోనా కేసులు... మే 4న 2 కోట్లకు (136 రోజులు పట్టింది) చేరాయి. 2 నుంచి 3 కోట్లకు చేరడానికి మాత్రం 50 రోజులే పట్టడం గమనార్హం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 6,43,194 యాక్టివ్‌ కేసులు ఉండగా, ఇది గత 82 రోజుల్లో అత్యల్పంగా నమోదైంది.  41 రోజులుగా కొత్త కేసులకంటే కోలుకుంటున్నవారే ఎక్కువగా ఉంటున్నారు. ఇప్పటివరకు కోవిడ్‌ బారిన పడి కోలుకున్నవారు 2,89,94,855 మంది కాగా గత 24 గంటలలో 68,817 మంది కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు 96.56 శాతానికి పెరిగింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 19,01,056 కోవిడ్‌ నిర్థారణ పరీక్షలు జరగగా, ఇప్పటిదాకా చేసిన మొత్తం పరీక్షలు 39.59 కోట్లకు పైగా ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ  2.67%గా నమోదు అయ్యింది.

భారత్‌లో 40 డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కేసులు
ఆందోళనకరమైన వేరియంట్‌(వీఓసీ)గా భావిస్తున్న కరోనా డెల్టా ప్లస్‌ వేరియంట్‌ (బి.1.617.2.1/ఏవై.1) భారత్‌లో నెమ్మదిగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటివరకు  40 కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ తెలిపింది. మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్‌లో ఈ వేరియంట్‌ ఉనికి ఎక్కువుంది. డెల్టాతోపాటు డెల్టా ఉపవర్గానికి చెందిన అన్ని వేరియంట్లు ఆందోళనకరమైనవిగా గుర్తించినట్లు వెల్లడించింది. దేశంలో ఇప్పటిదాకా 45 వేలకుపైగా నమూనాలను(శాంపిల్స్‌) పరీక్షించగా, మూడు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 40 పాజిటివ్‌ కేసులు బయటపడినట్లు పేర్కొంది. డెల్టా ప్లస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయా రాష్ట్రాలకు సూచించినట్లు తెలిపింది. కరోనా వైరస్‌ స్పైక్‌ ప్రొటీన్‌లో జరిగిన కే417ఎన్‌ మ్యుటేషన్‌ను డెల్టా ప్లస్‌ వేరియంట్‌గా (బి.1.617.2.1/ఏవై.1) వర్గీకరించారు.

మరిన్ని వార్తలు