విషాదం: బాలుడి కోసం, బావిలోకి గ్రామస్తులు, నలుగురు మృత్యువాత

16 Jul, 2021 08:36 IST|Sakshi

బావిలో పడిపోయిన బాలుడు

ఒకేసారి బావిలోకి దిగిన గ్రామస్తులు

గోడ కూలి బావిలో పడిపోయిన 30మంది 

నలుగురు మృత్యువాత, దర్యాప్తునకు సీఎం ఆదేశం

మృతులకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా

భోపాల్‌: బావిలో పడిపోయిన బాలుడిని కాపాడటానికి ప్రయత్నించిన గ్రామస్తులు అనూహ్యంగా ప్రమాదంలో పడిపోయిన ఘటన తీవ్ర ఆందోళనకు దారి తీసింది.  బాలుడిని రక్షించే ప్రయత్నంలో ఒకేసారి అక్కడికి చేరడంతో అధిక బరువుతో గోడ కూలి బావిలో పడిపోయారు. ఈ ఘటనలో దాదాపు 30 మంది ప్రమాదంలో చిక్కుకోగా, నలుగురు ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని నింపింది. మధ్యప్రదేశ్‌, విదిష పట్టణానికి సమీపంలో గంజ్‌బసోడ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

సమాచారం అందుకున్నఎన్‌డీఆర్‌ఆఫ్‌, రాష్ట్ర విపత్తు నిర్వహణ దళాలు సహాయక చర్యలును చేపట్టాయి. ఇతర ఉన్నతాధికారులు కూడా సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. బాలుడిని రక్షించేందుకు ప్రయత్నించిన వ్యక్తుల బరువు కారణంగా బావి పైకప్పు కూలిపోయిందని అధికారులు తెలిపారు. వీరిలో 19 మందిని  సిబ్బంది కాపాడారు. ఇంకా బావిలోనే చిక్కుకున్న  మిగిలిన వారిని  కాపాడే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

ఈ సంఘటనపై ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్ మరణించిన  వారి కుటుంబాలకు  సీఎం ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి రూ. 50 వేలు పరిహారంతోపాటు, ఉచిత వైద్య చికిత్స కూడా అందించనున్నామని వెల్లడించారు.  అలాగే ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. మరోవైపు సీఎం ఆదేశాల మేరకు మంత్రి విశ్వాస్‌ సారంగ్‌, సహాయ, రక్షణ చర్యలను  పర్యవేక్షిస్తున్నారు. 

మరిన్ని వార్తలు