Ashwini Vaishnaw: ఈ గ్రామాల్లో 4జినే లేదు!

31 Dec, 2022 08:58 IST|Sakshi

దేశంలో ఇలాంటి గ్రామాలు 45,180

5.98 లక్షల గ్రామాలకే 4జి సేవలు

అత్యధికంగా ఒడిశాలో 7,592 గ్రామాలకు 4జి సేవల్లేవు

మహారాష్ట్రలో 3,793 గ్రామాలకు, ఏపీలో 3,169 గ్రామాలకు 4జి లేదు

ఈ గ్రామాలకు 4జి సేవలందించాలంటే రూ.26,316 కోట్లు ఖర్చు

కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్‌ వెల్లడి

సాక్షి, అమరావతి: దేశంలో మొబైల్‌ సేవల రంగంలో అయిదో జనరేషన్‌ (5 జి) మొదలైంది. ఇంతకు ముందు 4జి, దానికి ముందు 2జి సేవలు అందించిన టెలికాం సంస్థలు ఇప్పుడు 5జిని అందిపుచ్చుకున్నాయి. సాంకేతికత వేగంగా విస్తరిస్తున్నప్పటికీ, దేశంలో ఇంకా 4జి సేవలే లేని గ్రామాలు ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయం. కానీ ఇది నిజం. దేశంలో ఇప్పటికీ 45,180 గ్రామాలకు 4 జి మొబైల్‌ సేవలు అందుబాటులో లేవని లోక్‌ సభలో కేంద్ర కమ్యూని­కేషన్స్, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ ఇటీవల వెల్లడించారు.

ఈ గ్రామాలకు సంతృప్త స్థాయిలో 4జి సేవలు అందించాలంటే రూ. 26,316 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసి­నట్లు ఆయన తెలిపారు. దేశంలో 6,44,131 గ్రామా­లుండగా ఇందులో 5,98,951 గ్రామాలకు 4జి మొబైల్‌ సేవలు అందుబాటులో ఉన్నాయ­న్నారు. అంటే 93శాతం గ్రామాలకు 4 జి సేవలు ఉన్నాయి. మిగతా 7 శాతం గ్రామాలకు 4జి నెట్‌వర్క్‌ లేదు. ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 99 శాతం గ్రామాలకు 4జి సేవలు అందుబాటులో ఉన్నాయి. అత్యధికంగా ఒడిశాలో 7,592 గ్రామలకు 4జి కవరేజ్‌ లేదు. మహా­రాష్ట్రంలో 3,793 గ్రామాలకు 4జి లేదు. ఆంధ్ర­ప్రదేశ్‌లో 3,169 గ్రామాల్లో 4జి అందుబాటు­లోకి రాలేదు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు 4జి సేవలందించేందుకు రూ.2,211 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. 

మరిన్ని వార్తలు