పీఎం కిసాన్ అర్హుల జాబితా నుంచి 33 లక్షల పేర్లు తొలగింపు

21 Feb, 2021 15:00 IST|Sakshi

కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని 2019లో తీసుకొచ్చిన సంగతి మనకు తెలిసిందే. అప్పటి నుంచి కేంద్రం అర్హత కలిగిన ప్రతి రైతుకు మూడు విడతల్లో రూ.2 వేలు చొప్పున ఏడాదికి రూ.6 వేలను బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తుంది. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితా నుంచి 33 లక్షల రైతుల పేర్లను తొలగించింది. వీరంతా అర్హత లేకున్నా పీఎం కిసాన్ నగదును పొందుతున్నట్లు కేంద్రం గుర్తించింది. అందుకే వీరి పేర్లను పీఎం కిసాన్ అర్హుల జాబితా నుంచి తొలగించింది. అనర్హులైన రైతుల నుంచి తిరిగి సుమారు 2,327 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు తెలిపింది.        

కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పంజాబ్, రాజస్థాన్, బీహార్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర సహా మొత్తం 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో రికవరీ ప్రక్రియ ప్రారంభమైంది. మిగిలిన రాష్ట్రాల్లో కూడా అనర్హులైన రైతుల నుంచి రికవరీని త్వరలో ప్రారంభించవచ్చు. పీఎం కిసాన్ వెరిఫికేషన్ ప్రక్రియ సమయంలో 32,91,152 మంది భోగస్ లబ్ధిదారులు ఉన్నట్లు గుర్తించారు. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ కు జత చేసిన ఆధార్, పాన్ నంబర్లను తనిఖీ చేసే సమయంలో కొన్ని లక్షల మంది రైతులు ఆదాయపు పన్నును చెల్లిస్తున్నారని గుర్తించింది. 

అలాగే ప్రభుత్వ, ప్రభుత్వేతర ఉద్యోగాలు, పెన్షనర్లు కూడా ఈ ప్రయోజనాలు పొందుతున్నట్లు గుర్తించింది. అనర్హుల జాబితాలో ఎక్కువ శాతం మంది తమిళనాడులో(6.96 లక్షల) ఉన్నారు. ఇక పంజాబ్ లో 4.70 లక్షల మంది, కర్ణాటకలో 2.04 లక్షల మంది, ఉత్తరప్రదేశ్ లో 1.78 లక్షలు మంది, రాజస్థాన్ లో 1.32 లక్షల మంది, హర్యానాలో 35 వేల మంది, గుజరాత్ లో ఏడు వేలకు పైగా బోగస్ లబ్ధిదారులు ఉన్నారు. అయితే మీకు పీఎం కిసాన్ డబ్బులు వస్తాయా? రావా? అని కూడా తెలుసుకోవచ్చు. దీని కోసం మీరు పీఎం కిసాన్ వెబ్‌సైట్‌కు వెళ్లాలి.

అర్హుల జాబితాలో మీ పేరు తనిఖీ చేసుకోండి ఇలా:

  • మొదట మీరు పీఎం-కిసాన్ పోర్టల్ సందర్శించాలి.
  • ఇప్పుడు మీకు ఫార్మర్స్ కార్నర్ సెక్షన్ లో కనిపించే Beneficiaries Listపై క్లిక్ చేయాలి.
  • తర్వాత రాష్ట్రం, జిల్లా, బ్లాక్, గ్రామం వంటి వివరాల ఎంటర్ చేసి మీ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు.
     
మరిన్ని వార్తలు