Mumbai Local Trains: కరోనా ఆంక్షలు.. నకిలీ కార్డులతో ప్రయాణం

26 Apr, 2021 14:15 IST|Sakshi

ముంబై లోకల్‌ రైళ్లలో మళ్లీ నకిలీ ఐడీ కార్డుల బెడద

నకిలీ గుర్తింపు కార్డులతో రైలెక్కుతున్న జనం 

సాక్షి, ముంబై: ముంబై లోకల్‌ రైళ్లలో సామాన్యులకు అనుమతి నిషేధించడంతో నకిలీ గుర్తింపు కార్డు (ఐడీ)ల బెడద మళ్లీ మొదలైంది. మూడు రోజుల్లోనే నకిలీ ఐడీల ద్వారా ప్రయాణిస్తున్న 35 మందిపై రైల్వే పోలీసుల చర్యలు తీసుకుని వాటిని స్వాధీనం చేసుకున్నారు. బ్రేక్‌ ది చైన్‌లో భాగంగా కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు ఈ నెల 22వ తేదీ రాత్రి 8 గంటల నుంచి లోకల్‌ రైళ్లలో అత్యవసర విభాగాలలో పనిచేసే ఉద్యోగులు మినహా సామాన్యులకు అనుమతి నిషేధించిన విషయం తెలిసిందే. దీంతో సామాన్యులతోటు ప్రైవేటు కార్యాలయాల్లో, ఇతర వ్యాపార వాణిజ్య సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు ఇబ్బందుల్లో పడిపోయారు. గత్యంతరం లేక బెస్ట్‌ లేదా ఆర్టీసీ బస్సులను ఆశ్రయించాల్సి వస్తుంది. కానీ, రోడ్డు ప్రయాణంతో పోలిస్తే లోకల్‌ రైలు ప్రయాణం చాలా చౌకగా ఉంటుంది.

బెస్ట్, ఆర్టీసీ బస్సుల్లో ఉప నగరాలు, శివారు ప్రాంతాల నుంచి ముంబైకి రాకపోకలు సాగించాలంటే రోజుకు కనీసం రూ.100–250 ఖర్చవుతుంది. ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ఇది గిట్టుబాటు కాదు. దీంతో బ్యాంకు, బీఎంసీ, తపాల, అంబులెన్స్‌ డ్రైవర్‌ ఇలా వివిధ అత్యవసర విభాగంలోని ఏదో ఒక చోట పనిచేస్తున్నట్లు నకలీ ఐడీ కార్డు తయారు చేయించుకుంటున్నారు. అందుకు స్టేషనరీ షాపులో, ఫోటో స్టూడియోలో కొందరు రూ.50–100 వరకు తీసుకుని అక్రమంగా వీటిని తయారు చేస్తున్నారు.


ఈ నకిలీ ఐడీ కార్డు ద్వారా లోకల్‌ రైళ్లలో సులభంగా రాకపోకలు సాగిస్తున్నారు. కానీ, రైల్వే పోలీసులు స్టేషన్‌ ప్రవేశ ద్వారం వద్ద చేపడుతున్న తనిఖీల్లో 35 మంది పట్టుబడ్డారు. పశ్చిమ మార్గంలో ఇలాంటి వారిని పట్టుకునేందుకు ప్రత్యేకంగా 135 మంది టీసీలను నియమించారు. నకిలీ ఐడీ ద్వారా రాకపోకలు సాగించే వారితోపాటు ముఖానికి మాస్క్‌ లేని వారిని కూడా పట్టుకుంటున్నారు. అక్కడ 80 మందిపై చర్యలు తీసుకుని రూ.1,200 వరకు జరిమానా వసూలు చేశారు.  

ఇక్కడ చదవండి: 

రూ.22 లక్షల కారు అమ్మేసి మరీ.. నువ్వు గొప్పోడివయ్యా!

ఆ వార్త విని షాకయ్యాం.. మాటలు రావడం లేదు

మరిన్ని వార్తలు