కారులోనే టెక్కీ మృతి.. ప్రోటోకాల్‌ పేరుతో వేధింపులు

1 May, 2021 14:34 IST|Sakshi

న్యూఢిల్లీ : కరోనా దెబ్బకు జనం చిగురుటాకుల్లా వణికిపోతున్నారు. ముసలి, ముతకా, ఉన్నోడు, లేనోడు ఇలా తారతమ్యాలు లేకుండా కరోనా ప్రతి ఒక్కరిపై తన ప్రతాపం చూపిస్తుండడంతో బ్రతుకు జీవుడా అంటూ క్షణం క్షణం భయం గుప్పిట్లో జనం బతుకుతున్నారు. ఓవైపు కరోనా సోకిందనే అనుమానంతో టెస్ట్‌లు చేయించుకుందామనేలోపే ఊపిరి ఆగిపోతున్న ఘటనలు కంటతడి పెట్టిస్తున్నాయి. తాజాగా ఢిల్లీకి చెందిన ఓ మహిళ ఆక్సిజన్‌ అందక ప్రాణాలు కోల్పోయింది. వివరాలు.. ఢిల్లీకి చెందిన 35 ఏళ్ల జాగృతి సాఫ్ట్‌ వేర్‌గా విధులు నిర్వహిస్తుంది. ఆమెకు ఇద్దరు పిల్లలు. అయితే ఆమెకు కరోనా సోకి ఆరోగ్యం క్షీణించడంతో అత్యవసర చికిత్స కోసం ఆమె భర్త తన కారులో ఇంటినుంచి గ్రేటర్ నోయిడాలోని ప్రభుత్వాసుపత్రికి బయలు దేరారు.

ఆస్పత్రి బయట పార్కింగ్‌ ఏరియాలో ఆమె స్పృహ కోల్పోయింది. దీంతో కంగారు పడ్డ ఆమె భర్త పరిగెత్తుకుంటూ వెళ్లి తనకు ఆక్సిజన్‌ సిలీండర్‌ కావాలని, తన భార్య ప్రాణాపాయస్థితిలో ఉందని ఆస్పత్రి సిబ్బందని వేడుకున్నాడు. ఆక్సిజన్‌ సిలిండర్‌ లేకపోవడంతో చివరికి ఆస్పత్రిలో అడ్మిట్‌ చేయాలని స్ట్రెచ్చర్‌ కోసం వెతికాడు. కానీ అప్పటికే నష్టం జరిగిపోయింది.

పార్కింగ్‌ స్థలంలో ఉన్న కారులోనే జాగృతి మరణించింది. బాధితురాలు ప్రాణాలు కోల్పోయిందని సమాచారం అందుకున్న ఆస్పత్రి సిబ్బంది ఆమె డెడ్‌బాడీ పట్ల మరింత కాఠిన్యం ప్రదర్శించారు. ప్రోటోకాల్‌ పేరుతో మృతదేహాన్ని మార్చురీకి తీసుకెళ్లి దహనం చేసేందుకు కూడా ఏర్పాట్లు చేయలేదు.పైగా దహన సంస్కారం చేసే ముందు సుమారు 3 గంటల పాటు తన భార్య జాగృతి మృతదేహాన్ని కారులో అలాగే ఉంచారని బాధితురాలి భర్త కన్నీరుమున్నీరయ్యాడు. 

మరిన్ని వార్తలు