5 రాష్ట్రాల నుంచే 38 శాతం కరోనా కేసులు!

7 Aug, 2020 11:11 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భారతదేశంలో రోజురోజుకు కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. కరోనా  కట్టడికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్రయోజనం ఉండటం లేదు. ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య రెండు మిలియన్లు దాటిపోయింది. 10 లక్షల కరోనా కేసులు దాటిన రోజు నుంచి వచ్చిన కొత్త కేసులలో దాదాపు 38 శాతం ఐదు రాష్ట్రాల నుంచే వచ్చాయి. అవి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బిహార్. ఈ రాష్ట్రాలలో జూలై 16కి ముందు 19 శాతం కన్నా తక్కువ కేసులు నమోదయ్యాయి. 

దేశంలో నమోదయిన మొదటి 10 లక్షల కేసులలో దాదాపు 12 శాతం కేసులు ఢిల్లీ నుంచి నమోదు అవ్వగా, రెండవ మిలియన్‌లో మాత్రం 3 శాతం కన్నా తక్కువ కేసులు వచ్చాయి. ఈ గణాంకాలను పరిశీలిస్తే  కరోనా వ్యాప్తి గత మూడు వారాల్లో భౌగోళికంగా ఎలా మారిందో అర్థం అవుతుంది.  ప్రస్తుతం ‘బిగ్ త్రీ’ - మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీలో కాకుండా దక్షిణ భారతదేశంలో ఎక్కువ వ్యాప్తి చెందుతోంది. జూలై 16న భారతదేశంలో కరోనా కేసులు మిలియన్ మార్కును దాటినప్పుడు నమోదయిన మొత్తంలో 56 శాతం ‘బిగ్ త్రీ’  నుంచి వచ్చాయి. వీటిలో  28.3 శాతం (284,281) కేసులు మహారాష్ట్రలోనే నమోదయ్యాయి.  తమిళనాడులో 15.6 శాతం (1,56,369 ), ఢిల్లీలో  11.8 శాతం (1,18,645) కేసులు నమోదయ్యాయి.

జూలై 16 తరువాత, దేశంలో వైరస్ వ్యాప్తి చెందుతున్న విధానంలో చాలా మార్పులు వచ్చాయి. ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. మొదటి మిలియన్‌ కేసులలో 11.8 శాతం ఢిల్లీ నుంచి నమోదుకాగా తరువాత మిలియన్‌ కేసులలో ఢిల్లీ నుంచి కేవలం 2.2 శాతం మాత్రమే వచ్చాయి. జూలై 16 తర్వాత నమోదైన కేసులలో దాదాపు ఐదవ వంతు కేసులు మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. తరువాత  దాదాపు 16 శాతం కేసులతో ఆంధ్రప్రదేశ్ ఎనిమిదవ స్థానం నుంచి రెండవ స్థానానికి చేరుకుంది. జూలై 16 నుంచి 122,775 కేసులతో, తమిళనాడు రెండవ మిలియన్ (12.1%) లో  మూడవ స్థానంలో ఉంది. ఈ రాష్ట్రాల్లో ఎక్కువగా కరోనా పరీక్షలు చేస్తుండటం వల్లే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. మొదటి మిలియన్‌ కరోనా కేసుల నమోదులో 19 శాతం కన్నా తక్కువ ఉన్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బిహార్ రాష్ట్రాలలో  జూలై 16 నుంచి  దాదాపు 42% కొత్త కేసులు వచ్చాయి. 

చదవండి: కరోనా రికార్డు: భారత్‌లో కొత్తగా 62 వేల కేసులు

మరిన్ని వార్తలు