ఫేస్‌బుక్‌లో పరిచయైన యువతితో పెళ్లికి సిద్ధపడ్డాడు.. రూ.39లక్షలు..!

19 Nov, 2022 15:38 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

నిలువునా మోసపోయిన అమాయకుడు 

రూ. 39 లక్షలు దోచేసిన ఎఫ్‌బీలో పరిచయమైన యువతి

సాక్షి, బెంగళూరు: ఫేస్‌బుక్‌ పరిచయం ఓ వ్యక్తిని నిలువునా ముంచింది. నాలుగు నెలల క్రితం విజయపుర జిల్లా సిందగి తాలూకా బగలూరి పరమేశ్వరహిప్పరగి అనే యువకుడి ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్‌రిక్వెస్ట్‌ వచ్చింది. ఆమోదించిన పరమే«శ్వరహిప్పరగి, యువతితో క్రమేణా పరిచయం స్నేహంగా మారింది. ఇద్దరు ఫోన్‌నెంబర్లు తీసుకున్నారు. చాటింగ్‌ ప్రారంభించారు. వంద, వెయ్యి రూపాయలనుంచి సుమారు రూ.39 లక్షలు పరమేశ్వరహిప్పరగి దశలవారీగా యువతి లాగేసింది. 

వివరాల్లోకి వెళితే... సిందగి నివాసి పరమేశ్వరకు 2022 జూన్‌ 29 తేదీన మంజుల, కేఆర్‌ అనే ఫేస్‌బుక్‌ ఐడీ నుంచి ఫ్రెండ్‌రిక్వెస్ట్‌ వచ్చింది. పరమే«శ్వర కన్‌ఫర్మ్‌ చేయగానే యువతి హాయ్‌ అని మెసేజ్‌ పెట్టింది. తెలంగాణా రంగారెడ్డి జిల్లాలో ప్రైవేటు కంపెనీలో ఉన్న పరమేశ్వర నిత్యం మెసేజ్‌ చేయడం ద్వారా గుర్తుతెలియని యువతితో ఆత్మీయంగా మెలిగారు. ఆగష్టు 14న తల్లి ఆరోగ్యం సరిగా లేదంటూ రూ.700 ఫోన్‌పే చేయాలని యువతి నుంచి మెసేజ్‌ వచ్చింది. అనంతరం రూ.2 వేలు అడగగానే యువతికి పరమేశ్వర ఫోన్‌ చేశాడు. కొద్దిరోజుల తరువాత తిథి కార్యక్రమానికి రూ.5 వేలు కావాలని యువతి అడిగిన వెంటనే పరమేశ్వర ఆమె అకౌంట్‌కు జమ చేశారు.  

చదవండి: (ప్రేమిస్తున్నానంటూ యువతికి పెళ్లైన వ్యక్తి ప్రపోజ్‌)

వివాహం చేసుకుంటానని నమ్మించి.... 
కొద్దిరోజుల అనంతరం ఫోన్‌ చేసిన మంజుల తాను ఐఏఎస్‌ పరీక్ష పాసయ్యాను. కలెక్టర్‌ పోస్టు వస్తుంది. ప్రస్తుతం హాసన్‌లో ఉన్నాను తనను చూసుకునేవారు ఎవరూ లేరు. బెంగళూరుకు వెళ్లాలి ఖర్చులకు డబ్బుల్లేవు ఆర్థిక సాయం చేస్తే వివాహం చేసుకుంటానని పరమేశ్వరకు తెలిపింది. యువతి మాటలు నమ్మిన పరమేశ్వర ఒకేరోజు రూ.50 వేలు  రెండు దఫాలుగా  చెల్లించాడు. కొద్దిరోజుల అనంతరం మంజుల మరింత స్నేహంగా మెలుగుతూ పరమేశ్వర నుంచి దశలవారీగా రూ.41.26 లక్షలు కాజేసింది.

అనంతరం తన వద్ద పైసా కూడా లేదని పరమేశ్వర మంజులను అడిగాడు. పాపం కొద్దిగా ఖర్చుకు డబ్బు  ఉండాలని భావించి మంజుల రూ.2.21 లక్షలు పరమేశ్వర అకౌంట్‌కు జమ చేసింది. మళ్లీ మంజుల డబ్బులు డిమాండ్‌ చేయడంతో అనుమానించిన ఆయన ఈనెల 15న విజయపుర సీఈఎన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేపట్టామని చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్‌పీ హెచ్‌డీ.ఆనందకుమార్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు