ఓటరు నమోదుకు ఏడాదిలో 4 కటాఫ్‌ తేదీలు

13 Dec, 2021 04:08 IST|Sakshi

పార్లమెంటరీ కమిటీకి తెలిపిన ప్రభుత్వం

న్యూఢిల్లీ: కొత్త ఓటర్ల నమోదుకు ఏడాదిలో నాలుగు కటాఫ్‌ తేదీలను అందుబాటులోకి తేవాలని కేంద్రం యోచిస్తోంది. ఇందుకు అనుగుణంగా ఎన్నికల చట్టంలో సవరణలు చేయనుంది. దీనివల్ల దేశంలో జరిగే స్థానిక సంస్థలు, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు ఉపయోగపడే ఉమ్మడి ఓటరు జాబితా రూపకల్పనకు వీలవుతుంది. యువజన ఓటర్లు మరింత మందిని ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములను చేయడానికి కూడా ఈ ప్రయత్నం తోడ్పడుతుందని పార్లమెంటరీ కమిటీకి కేంద్ర న్యాయశాఖ తెలిపింది.

ప్రస్తుతం జనవరి ఒకటో తేదీన, అంతకంటే ముందు 18 ఏళ్లు నిండిన వారు మాత్రమే ఆ ఏడాది తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవచ్చు. ఆ ఏడాదిలో జరిగే ఎన్నికల్లో ఓటు వేసేందుకు వారికి మాత్రమే అవకాశం ఉంటుంది. అయితే, జనవరి 2 జన్మించినా వారు మళ్లీ ఏడాదిదాకా ఆగాల్సిందే. అందుకే, ఏడాదిలో నాలుగు కటాఫ్‌ తేదీలను జత చేస్తూ ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 14(బి)ని సవరించాలని యోచిస్తున్నట్లు న్యాయశాఖ తెలిపింది. సంవత్సరంలో.. జనవరి 1, ఏప్రిల్‌ 1, జూలై 1, అక్టోబర్‌ 1లను కటాఫ్‌ తేదీలుగా మార్చే ప్రతిపాదనలను ఎన్నికల సంఘం పరిశీలిస్తోందని కేంద్రం తెలిపింది.  

మరిన్ని వార్తలు