Dalai Lama Bodh Mahotsav Event: దలైలామా ఈవెంట్‌ వేళ కరోనా కలకలం.. నలుగురు విదేశీయులకు పాజిటివ్‌

26 Dec, 2022 14:58 IST|Sakshi

పట్నా: కోవిడ్‌ మరోమారు విజృంభిస్తూ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. చైనాలో ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్‌ బీఎఫ్‌.7 వేగంగా వ్యాప్తి చెందుతూ లక్షల మందికి సోకుతోంది. ఈ క్రమంలో విదేశాల నుంచి వచ్చే వారిపై నిఘా పెంచింది భారత్‌. ఎయిర్‌పోర్టుల్లోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో బిహార్‌లోని గయా అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం నలుగురు విదేశీయులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. అందులో ముగ్గురు ఇంగ్లాండ్‌, ఒకరు మయన్మార్‌కు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. 

కోవిడ్‌ పాజిటివ్‌గా తేలిన విదేశీయులను ఐసోలేషన్‌కు తరలించారు. వారికి ఎలాంటి లక్షణాలు లేవని గయా సివిల్‌ సర్జన్‌ రంజన్‌ కుమార్‌ సింగ్‌ తెలిపారు.  ఎయిర్‌పోర్ట్‌లో మొత్తం 33 మందికి ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించగా అందులో నలుగురికి పాజిటివ్‌గా తేలింది. డిసెంబర్‌ 20న వారంతా బ్యాంకాక్‌ నుంచి గయా ఎయిర్‌పోర్ట్‌కు వచ్చారు. ఇంగ్లాండ్‌ దేశీయులను బోధ్‌ గయాలోని హోటల్‌లో ఐసోలేషన్‌లో ఉంచగా.. మయన్మార్‌కు చెందిన వ్యక్తి ఢిల్లీకి వెళ్లారు. 

బోధ్‌ గయాలో డిసెంబర్‌ 29న బౌద్ధమత గురువు దలైలామా ప్రసంగం కోసం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి లక్ష మందికిపైగా విదేశీ భక్తులు హాజరవుతారని అంచనా. 50 దేశాలపైగా భక్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు రిజిస్టర్‌ చేసుకున్నారు.  ఈ ఈవెంట్‌కు మూడు రోజుల ముందు నలుగురు విదేశీయులకు కరోనా పాజిటివ్‌గా తేలడం కలకలం సృష్టిస్తోంది. 

ఇదీ చదవండి: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే భవనంలో విద్యార్థి ఆత్మహత్య.. ఏం జరిగింది?

మరిన్ని వార్తలు