తమిళనాడులో విషాదం.. ఆలయ ఉత్సవాల్లో కుప్పకూలిన క్రేన్‌.. నలుగురి మృతి

23 Jan, 2023 10:57 IST|Sakshi

సాక్షి, చెన్నై: తమిళనాడులో విషాదం జరిగింది. అరక్కోణం సమీపంలో నిర్వహించిన ఓ ఆలయ ఉత్సవాల్లో భక్తులపై క్రేన్‌ కూలడంతో నలుగురు మత్యువాత పడ్డారు. మరో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. రాణిపేట జిల్లా నెమిలిలోని కిలివీడి గ్రామంలో ఆదివారం రాత్రి 8.15 గంటలకు ఈ ఘటన వెలుగు చూసింది. వివరాలు.. మాండియమ్మన్‌ దేవాలయంలో గత రాత్రి ద్రౌపది అమ్మన్‌ ఉత్సవాలు నిర్వహించారు. ఈ వేడుకలను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి 1500 మందికి పైగా భక్తులు తరలివచ్చారు. నెమిలికి చెందిన 50 మంది పోలీసులు మోహరించారు. సాధారణంగా సంక్రాంతి(పొంగల్‌) తరువాత ఈ పండుగను జరుపుకుంటారు.

ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన మైలేరు ఉత్సవాల్లో భాగంగా స్థానిక గ్రామానికి చెందిన వారు క్రేన్‌పై దేవతా విగ్రహాలను ఊరేగించారు. భక్తులు అందిస్తున్న పూలమాలలను అమ్మవారికి అలంకరించేందుకు 25 అడుగుల ఎత్తైన క్రేన్‌పై ముగ్గురు వ్యక్తులు నిలబడి ఉన్నారు. అయితే క్రేన్‌పై బరువు ఎక్కువవడటంతో ముందు భాగం ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోయింది. దీంతో భక్తులపై క్రేన్ పడిపోయింది. క్రేన్‌పై నున్న ముగ్గురు వ్యక్తులు కిందపడి అక్కడిక్కడే మరణించారు. 

అనూహ్య ఘటనతో ప్రజలు భయాందోళనలతో పరుగలు తీయడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఓ బాలికతో సహా తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను అరక్కోణంలోని ప్రభుత్వ తాలూకా ఆసుపత్రికి, పొన్నైలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య నలుగురికి చేరింది. మరోవైపు గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

ఘటనకు సంబంధించిన భయంకర దృశ్యాలు అక్కడ ఓ వ్యక్తి తీసిన ఫోన్‌లో రికార్డయ్యాయి. ఇందులో క్రేన్ ఒక్కసారిగా కుప్పకూలడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు కనిపిస్తున్నాయి. ప్రమాదంలో మరణించిన బాధితులను కే ముత్తుకుమార్‌(39), ఎస్‌ భూపాలన్‌(4), బి జ్యోతి బాబుఉ(17)గా గుర్తించారు. ఇక ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు.. క్రేన్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. 

మరిన్ని వార్తలు