జమ్మూకశ్మీర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతం

9 Jul, 2021 10:59 IST|Sakshi

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో ముగ్గురు నిషేధిత లష్కరే తోయిబా(ఎల్‌ఈటీ)కి చెందినవారు. అధికారుల సమాచారం ప్రకారం.. హిజ్బుల్‌ ముజాహిదీన్‌ కమాండర్‌ బుర్హాన్‌ వనీ ఐదో వర్థంతి సందర్భంగా జమ్మూకశ్మీర్‌లో పలు ప్రాంతాల్లో జనం బంద్‌ పాటించారు. ఈ నేపథ్యంలో పుల్వామా జిల్లాలోని పుచాల్‌ ప్రాంతంలో ముష్కరుల కదలికలపై సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. వీరి రాకను గమనించిన ముష్కరులు వెంటనే కాల్పులు ప్రారంభించారు. ఆత్మరక్షణ కోసం భద్రతా సిబ్బంది సైతం ఎదురు కాల్పులు జరిపాల్సి వచ్చింది. కొంతసేపటి తర్వాత ఉగ్రవాదుల వైపునుంచి కాల్పులు ఆగిపోయాయి.

ఘటనా స్థలానికి వెళ్లి చూడగా, రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులు లష్కరే తోయిబాకు చెందిన కిఫాయత్‌ రంజాన్‌ సోఫీ, అల్‌ బదర్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన ఇనాయత్‌ అహ్మద్‌ దార్‌గా గుర్తించారు. ఇక కుల్గామ్‌ జిల్లాలో జాతీయ రహదారిపై ఉగ్రవాదులు ప్రయాణిస్తున్నారన్న సమాచారంతో అధికారులు చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. వాహనాల తనిఖీ చేపట్టారు. అనుమానాస్పదంగా కనిపించిన ఓ వాహనాన్ని ఆపగా, అందులోని ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. భద్రతా సిబ్బంది సైతం ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఉద్దరు ఉగ్రవాదులు మరణించారు. మృతులు లష్కరే తోయిబాకు చెందిన నాసిర్‌ అహ్మద్‌ పండిత్, షాబాజ్‌ అహ్మద్‌ షాగా గుర్తించారు.

జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు జవాన్ల వీరమరణం
జమ్మూ: పాకిస్తాన్‌ ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భారత భద్రతా సిబ్బంది విజయవంతంగా తిప్పికొట్టారు. కశ్మీర్‌లో రాజౌరీ జిల్లా సుందర్బనీ ప్రాంతంలో ఉన్న దాదల్‌ అటవీ ప్రాంతంలో నియంత్రణ రేఖ(ఎల్‌ఓసీ) వద్ద భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు పాకిస్తాన్‌ ముష్కరులు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం అందడంతో గురువారం భద్రతా సిబ్బంది రంగంలోకి దిగారు. వారిపై చొరబాటుదారులు కాల్పులు జరిపారు. సైన్యం దీటుగా బదులిచ్చింది. ఈ ఘటనలో ఇద్దరు పాకిస్తాన్‌ ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే  భారత సైన్యానికి జవాన్లు శ్రీజిత్‌.ఎం, మరుప్రోలు జశ్వంత్‌రెడ్డి వీరమరణం పొందారని సైనిక ఉన్నతాధికారులు ప్రకటించారు. 
 

మరిన్ని వార్తలు