ప్రభుత్వానికి ప్రశాంతత లేకుండా చేస్తాం

15 Feb, 2021 05:39 IST|Sakshi
పుల్వామా, రైతు నిరసనల మృతులకు సంఘీభావంగా కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టిన రైతులు

మా సమస్యలను పరిష్కరించాల్సిందే

రైతు సంఘం నేత రాకేశ్‌ తికాయత్‌

కర్నాల్‌: డిమాండ్లను పరిష్కరించే వరకు రైతులు ప్రభుత్వానికి ప్రశాంతత లేకుండా చేస్తారని భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేశ్‌ తికాయత్‌ అన్నారు. కర్నాల్‌ జిల్లా ఇంద్రి ధాన్యం మార్కెట్‌లో ఆదివారం జరిగిన మహాపంచాయత్‌లో ఆయన ప్రసంగించారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరే కంగా నిరసనలు కొనసాగిస్తున్న రైతు సంఘాలకు చెందిన 40 మంది నేతలు మద్దతు కూడగట్టేందుకు దేశవ్యాప్తంగా పర్యటిస్తారని వెల్లడించారు. ‘డిమాం డ్లకు అంగీకరించకుండా, రైతు సంఘాలతో చర్చలు జరపకుండా ఉన్నంత కాలం ప్రభుత్వాన్ని ప్రశాంతంగా కూర్చో నివ్వకుండా చేస్తాం’అన్నారు.

మూడు కొత్త వ్యవసాయ చట్టాలను ప్రభుత్వం ఉపసం హరించుకోవాల్సిందేననీ, అప్పటి దాకా పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కొత్త సాగు చట్టాలతో ప్రజా పంపిణీ వ్యవస్థ అంతమ వుతుందన్నారు. రైతులతోపాటు చిన్న వ్యాపా రులు, రోజు కూలీలు తదితరులపైనా ఈ చట్టాలు ప్రభావం చూపుతాయని తికాయత్‌ చెప్పారు. ఆకలితో వ్యాపారం చేయడాన్ని అనుమతించబో మని తెగేసి చెప్పారు. కొత్త చట్టాలు కార్పొరేట్లకు అనుకూలమనే విషయం రైతులకు తెలియదను కుంటున్నారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సింఘు బోర్డర్‌లో జరుగుతున్న ఆందోళనలే రైతు నిరసనలకు కేంద్ర బిందువుగా ఉంటాయన్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాకేశ్‌ తికాయత్‌ రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఘాజీపూర్‌ వద్ద రెండు నెలలుగా నిరసనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.
 

మరిన్ని వార్తలు