ఆ వ్యాధి మరణిస్తేనే తెలుస్తుంది!

20 Sep, 2020 08:18 IST|Sakshi

అల్జీమర్స్‌ అన్న పదం మీరు ఎప్పుడైనా విన్నారా?

దేశంలో సుమారు 40 లక్షల మంది ఉన్నారు

ప్రపంచ అల్జీమర్స్‌ దినంగా పాటిస్తుంటారు

వయసు మీదపడిన తర్వాత చాలా మందిలో మతిమరుపు ఉండటం సహజం. కానీ ఓ వ్యక్తి చొక్కాకు గుండీలు పెట్టుకోవడం కూడా తెలియని స్థితికి చేరితే? తిట్టినా.. కొట్టినా ఏ రకమైన ఉద్వేగమూ కనిపించకుండా మారిపోతే? తిండి తినడం మొదలుకొని రోజూ వెళ్లే దారి వరకూ చాలా అంశాలు కూడా మరిచిపోతే? అది అల్జీమర్స్‌ కావచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు. నలభై యాభై ఏళ్ల వయసులో మొదలై 65 దాటిన తర్వాతగానీ గుర్తించేంత స్థాయికి ముదరని ఈ వ్యాధికి కారణమేమిటో తెలియదు. చికిత్స కూడా లేదు. ఈ సమస్యలకు పరిష్కారాలు కనుక్కునేందుకు ఒకవైపు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ముదిమిలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్న అల్జీమర్స్‌ వ్యాధిగ్రస్తులు మాత్రం ఏటా పెరిగిపోతూనే ఉన్నారు. 2050నాటికి భూమ్మీద కనీసం 15.2 కోట్ల మంది వ్యాధిగ్రస్తులు ఉంటారని అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. (కోపంగా ఉన్నారా.. ఈ సమస్య ఉన్నట్లే)

130 కోట్ల మంది జనాభా ఉన్న భారతదేశంలో 40 లక్షల మంది అల్జీమర్స్‌ వ్యాధి బారిన పడ్డారు. ఇది ఏమంత పెద్ద సంఖ్యగా కనిపించకపోవచ్చు. అయితే ఈ వ్యాధి విషయంలో చైనా, అమెరికాల తర్వాతి స్థానం మనదే కావడం గమనార్హం. 2030 నాటికల్లా దేశంలో అల్జీమర్స్‌ వ్యాధిగ్రస్తుల సంఖ్య 75 లక్షలకు చేరుకుంటుందని అంచనా. కాకపోతే భారతదేశంలో ఈ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య ఇతర దేశాల కంటే తక్కువగా ఉందని, పసుపు వాడకం ఇందుకు కారణమని ఇటీవలే జరిగిన ఒక అధ్యయనం చెబుతోంది. పసుపులోని కర్కుమిన్‌.. అల్జీమర్స్‌కు కారణమని భావిస్తున్న ప్రొటీన్‌ ఒకటి మెదడులో ఎక్కువ కాకుండా నియంత్రిస్తుందని కాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో తెలిసింది. (బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే..)


అల్జీమర్స్‌ అంటే...
మతిమరుపు బాగా ముదిరితే వచ్చే సమస్య. మతిమరుపుతో బాధపడుతున్న వారిలో కనీసం 60–80 శాతం మంది అల్జీమర్స్‌ బారిన పడవచ్చు. వ్యాధులు లేదా మెదడుకు తగిలిన దెబ్బల కారణంగా జ్ఞాపక శక్తి, ఆలోచించే విధానం, ప్రవర్తనలో మార్పులు వస్తాయి. అల్జీమర్స్‌ సమస్య ఉన్నట్లు చాలా లేటుగా అంటే 65 ఏళ్ల తర్వాత గుర్తిస్తుండటం గమనార్హం. ఒకవేళ అంతకంటే ముందుగా గుర్తించినప్పటికీ దాన్ని ఎర్లీ ఆన్‌సెట్‌ ఆఫ్‌ అల్జీమర్స్‌గానే పరిగణిస్తుంటారు. ఈ సమస్యకు కచ్చితమైన చికిత్స అంటూ ఏదీ లేదు. కాకపోతే సమస్య మరీ ఎక్కువ కాకుండా నియంత్రించే పద్ధతులు మాత్రం అందుబాటులో ఉన్నాయి.

మతిమరుపు కంటే ఎలా భిన్నం?
మతిమరుపు.. అల్జీమర్స్‌ రెండూ ఒకటే అన్నది చాలా మందిలో ఉన్న అభిప్రాయం. కానీ అల్జీమర్స్‌ అనేది ఒక రకమైన మతిమరుపుగా మాత్రమే వైద్యశాస్త్రం గుర్తిస్తుంది. విషయాలను మరచిపోవడం, గందరగోళానికి గురవడం డిమెన్షియా తాలూకూ స్థూల లక్షణాలు. అయితే అల్జీమర్స్, పార్కిన్‌సన్స్‌ వ్యాధి, మెదడుకు తీవ్రమైన దెబ్బ తగలడం వంటివి కూడా ఈ లక్షణాలను కలుగజేస్తాయి. సాధారణంగా చేసే పనులను కూడా చేయలేకపోవడం అల్జీమర్స్‌ లక్షణాల్లో ఒకటి. ఉదాహరణకు మైక్రోవేవ్‌ను చాలాకాలంగా వాడుతున్నప్పటికీ అకస్మాత్తుగా అదెలా వాడాలో స్పష్టంగా తెలియకపోవడం అన్నమాట. దీంతోపాటు మాట, రాతల్లో సమస్యలు ఏర్పడటం, వ్యక్తిగత శుభ్రత లోపించడం, ప్రాంతాలకు సంబంధించిన విషయాలు గుర్తులేకపోవడం వంటివన్నీ అల్జీమర్స్‌ లక్షణాలుగా పరిగణించవచ్చు. భావోద్వేగాల్లో మార్పులు, బంధు మిత్రులకు దూరంగా ఉండటం కూడా ఈ వ్యాధి సమస్యలే.

మరణిస్తేనే తెలుస్తుంది!
మతిమరుపునకు, అల్జీమర్స్‌కూ తేడా ఉన్న విషయం మనకు తెలుసు. మరి వైద్యులు ఏది ఏ సమస్యో ఎలా గుర్తిస్తారు. అల్జీమర్స్‌ను నిర్ధారించడం మెదడు కణజాలాన్ని పరిశీలించడం ద్వారా మాత్రమే సాధ్యం. అంటే మరణం తర్వాతే వ్యాధిని గుర్తించగలమన్నమాట. మరి బతికుండగా వ్యాధి ఉంటే? మరి గుర్తించడం ఎలా?ఇందుకోసం చాలా పద్ధతులు ఉన్నాయి లెండి. కుటుంబ చరిత్రను బట్టి అంచనా వేయడం, జన్యు పరీక్షల ద్వారా అల్జీమర్స్‌ కారక జన్యువుల ఉనికి తెలుసుకోవడం వీటిల్లో కొన్ని. దీంతోపాటు వైద్యులు కొన్ని ప్రశ్నలకు సమాధానాలు రాబట్టడం ద్వారా అల్జీమర్స్, డిమెన్షియాల మధ్య తేడాను గుర్తించగలరు. మానసిక పరిస్థితిని గుర్తించిన తర్వాత మీ షార్ట్‌టర్మ్, లాంగ్‌టర్మ్‌ మెమొరీని గుర్తించేందుకు ప్రశ్నలు వేస్తారు. దీనికి రక్తపోటు, గుండె కొట్టుకునే వేగం, ఉష్ణోగ్రతలు, అవసరమైతే మూత్ర పరీక్షలు నిర్వహించి ఒక అంచనాకు వస్తారు. నాడీ సంబంధిత సమస్యలేవైనా ఉన్నాయా? అన్నది పరిశీలిస్తారు. ఎమ్మారై, సీటీ, పీఈటీ వంటి స్కాన్ల ద్వారా మెదడు నిర్మాణం, అందులోని తేడాలను తెలుసుకుంటారు. వీటన్నింటి ఆధారంగా వైద్యులు తుది నిర్ణయానికి వస్తారు. 

నివారణ ఎలా?
అల్జీమర్స్‌కు కచ్చితమైన చికిత్స ఏదీ లేదు. కానీ.. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే వ్యాధి రాకను ఆలస్యం చేయడంతోపాటు లక్షణాల తీవ్రతను కొంత వరకు తగ్గించవచ్చు అని ఇప్పటివరకు జరిగిన పరిశోధనలు చెబుతున్నాయి.  

  • ధూమపానానికి దూరంగా ఉండటం
  • వ్యాయామం క్రమం తప్పకుండా చేయడం
  • బుర్రకు పదునుపెట్టే కార్యకలాపాలు చేపట్టడం 
  • శాఖాహారం తీసుకోవడం.. యాంటీ ఆక్సిడెంట్లు 
  • ఎక్కువగా తీసుకునేలా జాగ్రత్త పడితే ప్రయోజనం ఉంటుందని అంచనా ఏకాగ్రత పెంచుకునేందుకు ప్రయత్నించడం, 
  • వాగ్వాదాలకు దూరంగా ఉండటం 
  • రోజూ తగినంత విశ్రాంతి తీసుకోవడం
  •  వీటన్నింటినీ జాగ్రత్తగా పాటిస్తే వ్యాధిని
  •  కొంత వరకు నివారించవచ్చు.  

1,850 కోట్ల గంటలు : అమెరికాలో వైద్య సిబ్బంది వేతనం లేకుండా అల్జీమర్స్‌ బాధితుల కోసం వెచ్చించిన సమయం


5.2 శాతం : మతిమరుపు (డిమెన్షియా) సమస్య ఉన్న 60 ఏళ్ల పైబడ్డవారు 
204 శాతం: 2018–2050 మధ్యకాలం లో పెరిగే అల్జీమర్స్‌ బాధితులు 
10 శాతం: దిగువ, మధ్యాదాయ దేశాల్లో 2050 నాటికి పెరిగే మతిమరుపు బాధితులు
నలుగురిలో ఒకరు.. అల్జీమర్స్‌ వ్యాధిగ్రస్తుల్లో వ్యాధి నిర్ధారణ జరిగే వారు 
27,700 కోట్ల డాలర్లు: ఒక్క అమెరికాలో అల్జీమర్స్, మతి మరుపులపై పెట్టిన ఖర్చు 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా