400 ఏళ్ల నాటి పురాతన రాజ వంశ విగ్రహం కోసం... దొంగలనే బురిడి కొట్టించిన పోలీసులు

5 Aug, 2022 21:12 IST|Sakshi

చెన్నై: తమిళనాడులోని పురాతన విగ్రహాలను కనిపెట్టే వింగ్‌(ఐడల్‌ వింగ్‌)కి సేతుపతి వంశానికి చెందిన 400 ఏళ్ల నాటి పురాతన విగ్రహం గురించి సమాచారం అందింది. ఈ మేరకు ఐడల్‌ వింగ్‌ బృందం అండర్‌ కవర్‌ అపరేషన్‌ చేపట్టి ఆ విగ్రహాన్ని కనిపెట్టారు. ఈ మేరకు అధికారులు తుత్తకుడి నివాసితులైన ఆరుముగరాజ్‌, కుమార్‌వేల్‌ అనే ఇద్దరు వ్యక్తులు ఈ పురాతన విగ్రహాన్ని విక్రయిస్తున్నారని తెలుసుకున్నారు.

దీంతో పోలీసులు తమ సిబ్బందిలోని కొంతమంది ధనవంతులైన వ్యక్తులుగా వారిని కలుసుకుని పరిచయం చేసుకున్నారు. ఈ విధంగా ధనవంతులైన వ్యక్తులుగా ఆ విగ్రహానికి కొనుగోలు చేసే నెపంతో వారి నుంచి స్వాధీనం చేసుకోవాలని వ్యూహం పన్నారు పోలీసులు. ఈ క్రమంలోనే ముస్తఫ్‌ అనే వ్యక్తి పురాతన విగ్రహాన్ని తిరుచ్చి - మదురై హైవేపై ముందుగా నిర్ణయించిన ప్రదేశానికి తీసుకువచ్చాడు. ఐతే పోలీసులు ఆ విగ్రహాన్ని చూడటానికి కోట్లలలో తమ వద్ద డబ్బు ఉందని నిరూపించుకోవాల్సి వచ్చింది.

ఆ స్మగ్లర్లతో బేరసారాలు ఆడుతూ అసలు గుట్టంతా తెలసుకుని ముస్తఫా, ఆరుముగరాజ్, కుమారవేల్‌లను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఆ నిందితులను విచారించగా  తమిళనాడులోని శివగంగై జిల్లాకు చెందిన సెల్వకుమార్ అనే వ్యక్తి నుంచి ఈ విగ్రహాన్ని పొందినట్లు తెలిపాడు. ఐతే సెల్వకుమార్‌ వద్దే ఈ విగ్రహం 12 ఏళ్లుగా ఉందని, దీన్ని తన తండ్రి నాగరాజన్‌ ఇచ్చాడని చెప్పాడు. ఈ విగ్రహం సేతుపతి వంశానికి చెందిన పురాతన మహిళ విగ్రహం. ఆ విగ్రహం ఖరీదు వేల కోట్లలో ఉంటుందని అధికారులు వెల్లడించారు .

(చదవండి: కస్టమర్‌కి చేదు అనుభవం... అలా వచ్చాడని టికెట్టు ఇవ్వనన్న మల్టీప్లెక్స్‌ థియేటర్‌)

మరిన్ని వార్తలు