అమిత్‌ షా సమక్షంలో 40వేల కిలోల డ్రగ్స్‌ ధ్వంసం

8 Oct, 2022 19:32 IST|Sakshi

గువాహటి: మాదక ద్రవ్యాల నియంత్రణ బ్యూరో ఆధ్వర్యంలో ఈశాన్య రాష్ట్రాల్లో ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించి 40,000 కిలోల వివిధ రకాల డ్రగ్స్‌ను పట్టుకున్నారు. వాటిని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సమక్షంలో శనివారం ధ్వంసం చేసినట్లు హోం మంత్రిత్వ శాఖ కార్యాలయం తెలిపింది. ప్రస్తుతం అస్సాం పర్యటనలో ఉన్న అమిత్‌ షా గువాహటి నుంచి వర్చువల్‌గా డ్రగ్స్‌ ధ్వంసం చేసే ప్రక్రియను పర్యవేక్షించినట్లు ట్వీట్‌ చేసింది. అస్సాంలో 11,000 కిలోలు, అరుణాచల్‌ ప్రదేశ్‌లో 8,000 కిలోలు, మేఘాలయలో 4,000 కిలోలు, నాగాలాండ్‌లో 1600 కిలోలు, మణిపుర్‌లో 398 కిలోలు, మిజోరాంలో 1900కిలోలు, త్రిపురలో 13,500 కిలోలు పట్టుకున్నట్లు వెల్లడించింది. 

అస్సాం పర్యటనలో ఉన్న అమిత్‌ షా.. డ్రగ్‌ అక్రమ రవాణా, జాతీయ భద్రత అంశంపై ప్రాంతీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈశాన్య ప్రాంతంలో మత్తు పదార్థాల అక్రమ రవాణా, నియంత్రణపై సమీక్షించారు. ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డీజీపీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా ఎన్‌సీబీ ఆధ్వర్యంలో 75,000 కిలోల డ్రగ్స్‌ను ధ్వంసం చేయాలని నిర్ణయం తీసుకున్నాం. అంతకు రెండింతలు 150,000 కిలోలు ధ్వంసం చేయటం చాలా సంతోషంగా ఉంది. ఇది చాలా పెద్ద విజయం.’ అని తెలిపారు షా. 

కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేస్తున్న ఎన్‌సీబీ జూన్‌ 1 నుంచి ప్రత్యేక ఆపరేషన్‌ నిర్వహించి మత్తు పదార్థాలను పట్టుకుంటోంది. దేశాన్ని మత్తు పదార్థాల రహితంగా మారుస్తామన్న మోదీ ప్రభుత్వ ఆశయానికి తగినట్లుగా డ్రగ్స్‌ను ధ్వంసం చేస‍్తున్నట్లు హోంశాఖ తెలిపింది. గత జులై 30న సుమారు 82వేల కిలోల డ్రగ్స్‌ను ధ్వంసం చేశారు. అదే రోజు ఛత్తీస్‌గఢ్‌లో పర్యటించిన అమిత్‌ షా.. 31 వేల కిలోల డ్రగ్స్‌ ధ్వంసం చేసే ప్రక్రియను వర్చువల్‌గా పర్యవేక్షించారు.

ఇదీ చదవండి: అధ్యక్ష ఎన్నికల్లో చివరి వరకు కొనసాగుతా: శశిథరూర్‌

మరిన్ని వార్తలు