-

పైప్‌లైన్ అమరిక పూర్తి.. ఏ క్షణంలోనైనా కార్మికులు బయటకు!

28 Nov, 2023 15:44 IST|Sakshi

ఉత్తరకాశీ: ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకున్న కార్మికులకు మరికొద్ది క్షణాల్లో విముక్తి కలగనుంది. దాదాపు 17 రోజుల నుంచి కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌ కొలిక్కి వచ్చింది. ఇప్పటికే పైపులైన్‌ను పూర్తిగా దించేశారు. ర్యాట్ హోల్ మైనింగ్ టెక్నిక్‌లో రెస్క్యూ బృందాలు సొరంగంలో చిక్కుకున్న కార్మికుల వద్దకు డ్రిల్లింగ్ పనులు పూర్తి చేసినట్లు సమాచారం. పైప్‌లైన్‌ గుండా కార్మికులను బయటకు తీసుకురావడానికి ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది మాక్ డ్రిల్స్‌ కూడా పూర్తి చేశారు. కార్మికులు ఏ క్షణంలోనైనా బయటకు రావచ్చని ఉత్తరఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ట్వీట్ చేశారు.

అంబులెన్స్‌లు సిద్ధం..
సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికుల కుటుంబ సభ్యులకు కూడా ఇప్పటికే సమాచారాన్ని అందించారు. కార్మికులను కలుసుకోవడానికి కుటుంబ సభ్యులు దుస్తులు, బ్యాగులతో సిద్ధంగా ఉండాలని కోరారు. టన్నెల్ నుంచి బయటకు తీసుకురాగనే కార్మికులకు ప్రాథమిక చికిత్స అందించడానికి టన్నెల్‌లో బెడ్స్‌ను ఏర్పాటు చేశారు. కార్మికులను బయటకు తీసుకురాగానే ఉత్తరకాశీలో ఆస్పత్రికి తీసుకువెళ్లడానికి 41 అంబులెన్స్‌లను సిద్ధం చేశారు. ఆస్పత్రిలో 41 బెడ్స్‌తో ప్రత్యేక వార్డ్‌ను కూడా ఏర్పాటు చేశారు. తమ కుటుంబ సభ్యులను కలుసుకోవాడనికి బాధిత బంధువులు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. 

‘ర్యాట్‌ హోల్‌ మైనింగ్‌’ బృందానికి చెందిన అనుభవజ్ఞులైన 24 మంది మాన్యువల్ డ్రిల్లింగ్ ప్రక్రియలో నిమగ్నమయ్యారు. ముందుగా 800 మిల్లీమీటర్ల వ్యాసమున్న స్టీల్‌ పైపు నుంచి డ్రిల్లింగ్‌ మెషీన్‌ బ్లేడ్లను తొలగించారు. అదే మార్గంలో దూరిన కార్మికులు.. సొరంగానికి మ్యాన్యువల్‌గా రంధ్రం చేయడం ప్రారంభించారు. ర్యాట్‌ హోల్‌ మైనింగ్‌ కార్మికులు మాన్యువల్‌ డ్రిల్లింగ్‌ ద్వారా శిథిలాలను బయటకు తీస్తున్నారు. 

'ఇది మనందరికి సంతోషకరమైన వార్త. రెస్క్యూ ఆపరేషన్ దాదాపుగా విజయం సాధించినందుకు ప్రధాని మోదీ, ఉత్తరఖండ్ పాలనా యంత్రాంగానికి, యూపీ ప్రభుత్వం తరపున పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.' అని రెస్క్యూ ఆపరేషన్‌ యూపీ ప్రభుత్వం కోఆర్డినేటర్ అరుణ్ మిశ్రా తెలిపారు. 
 
ఏమిటీ ర్యాట్‌–హోల్‌ పద్ధతి?
మేఘాలయలో ఈ పద్ధతి చాలా ఫేమస్‌. అక్రమ బొగ్గు గనుల్లో ఈ విధానంలోనే బొగ్గు తవ్వేస్తారు. ముందుగా గని ఉపరితలంపై మనిషి దూరేంత చిన్న రంధ్రం చేసి అందులోకి వెళ్లి సమాంతరంగా చిన్న చిన్న రంధ్రాలు చేస్తూ బొగ్గుపొరలను తొలుస్తారు.

‘‘ మేం పదేళ్లుగా ఇదే వృత్తిలో ఉన్నాం. కార్మికులను కాపాడేందుకు పనిచేయడం ఇదే తొలిసారి. ఇక్కడ 800 మిల్లీమీటర్ల పైపులోంచి వెళ్లి పనిచేయాలి. మేం 600 మిల్లీమీటర్ల పైపులో కూడా దూరి పనిచేశాం. చిన్న గడ్డపార, పార, చిన్న తట్ట వెంట తీసుకెళ్లి చిన్న చిన్న రంధ్రాలు చేస్తూ శిథిలాలను తొలగిస్తాం. 12 మీటర్లలో కేవలం మట్టి ఉంటే పని 24 గంటల్లో పూర్తి అవుతుంది. ఒకవేళ గట్టి రాళ్లు ఉంటే 36 గంటలకుపైనే పడుతుంది. వంతుకు ఇద్దరు చొప్పున ఆరుగురం తవ్వేస్తాం’’ అని కార్మికులు వెల్లడించారు. 

ఇదీ చదవండి: Uttarakhand Tunnel Rescue Operation: రెస్క్యూ ఆపరేషన్‌కు ఎడతెగని ఆటంకాలు!

మరిన్ని వార్తలు