554 మంది జడ్జీల్లో 430 మంది జనరల్‌ కేటగిరీయే

3 Feb, 2023 05:01 IST|Sakshi

న్యూఢిల్లీ: 2018 నుంచి హైకోర్టు జడ్జీలుగా నియమితులైన 554 మందిలో 430 మంది జనరల్‌ కేటగిరీకి చెందిన వారేనని న్యాయ శాఖ మంత్రి కిరెన్‌ రిజిజు రాజ్యసభలో తెలిపారు. మిగిలిన వారిలో 58 మంది ఇతర వెనుకబడిన కులాలకు, 19 మంది షెడ్యూల్‌ కులాలకు చెందిన వారు కాగా, కేవలం ఆరుగురు షెడ్యూల్‌ తెగలకు, 27 మంది మైనారిటీలని వివరించారు. మొత్తమ్మీద 84 మంది మహిళా జడ్జీలున్నారని చెప్పారు. మొత్తం జడ్జీల్లో జనరల్‌ కేటగిరీకి చెందిన వారే 77% పైగా ఉన్నారన్నారు.

సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల నియామకాలకు రిజర్వేషన్లు లేవని మంత్రి పేర్కొన్నారు. అత్యున్నత న్యాయ వ్యవస్థలోనూ సామాజిక వైవిధ్యం సాధించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. జడ్జీల నియామకాలకు ప్రతిపాదనలు పంపే సమయంలో అర్హులైన ఎస్‌సీ, ఎస్‌టీ, మైనారిటీ, మహిళా జడ్జీల పేర్లను కూడా పరిశీలించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను కోరుతోందని వెల్లడించారు. 2018 నుంచి ఇప్పటి వరకు సుప్రీంకోర్టులో 30 మంది జడ్జీలు నియమితులయ్యారని చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న జిల్లా జడ్జీల్లో 612 మంది ఎస్సీలు, 204 మంది ఎస్‌టీలు, 1,329 మంది ఓబీసీలు, 1,406 మంది మహిళలు ఉన్నారని ఒక ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు