Crowdfunding: వారంలో రూ. 46 కోట్లు 

26 Jul, 2021 07:39 IST|Sakshi

చిన్నారి చికిత్సకు విరాళాల వెల్లువ 

కన్నూర్‌: మానవత్వం పరిమళించింది. అరుదైన జన్యుపర వ్యాధితో బాధపడుతున్న 18 నెలల కేరళ చిన్నారి చికిత్స కోసం ప్రారంభించిన ‘క్రౌడ్‌ ఫండింగ్‌’కు అనూహ్య స్పందన వచ్చింది. వారం రోజుల్లో రూ.46.78 కోట్ల రూపాయలను దాతలు అందజేశారు. వివరాల్లోకి వెళ్తే... కన్నూరు జిల్లాకు చెందిన పి.కె.రఫీక్, మరియమ్మ దంపతుల కుమారుడు మొహమ్మద్‌ (18 నెలలు) అరుదైన ‘స్పైనల్‌ మస్క్యులర్‌ ఆట్రోఫీ’ వ్యాధితో బాధపడుతున్నాడు. దీని చికిత్సకు ‘జోల్‌జెన్స్‌మా’ అనే అత్యంత ఖరీదైన ఔషధం అవసరం. ఇది ఒక డోసు రూ.18 కోట్లు ఉంటుంది. దాంతో కలైసెరి ఎమ్మెల్యే ఎం.విజిన్‌ చిన్నారి చికిత్సకు క్రౌడ్‌ ఫండింగ్‌ ద్వారా సహాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఇది సోషల్‌మీడియాలో బాగా వైరల్‌ అయింది. దేశవిదేశాల్లోని కేరళీయులతో సహా మొత్తం 7.7 లక్షల మంది స్పందించారు. ప్రత్యేకంగా తెరిచిన బ్యాంక్‌ అకౌంట్లో వారం రోజుల్లో మొత్తం రూ.46,78,72,125 విరాళాల రూపంలో జమ అయ్యాయి.

ఈ విషయాన్ని ఆదివారం విజిన్‌ వెల్లడించారు. విదేశాల నుంచి ‘జోల్‌జెన్స్‌మా’ను తెప్పించే ప్రక్రియను కేరళ ప్రభుత్వం మొదలు పెట్టింది. వచ్చేనెలలో మొహమ్మద్‌కు ఈ ఔషధాన్ని అందజేస్తామని ఎమ్మెల్యే విజిన్‌ కన్వీనర్‌గా క్రౌడ్‌ ఫండింగ్‌ కోసం ఏర్పాటైన కమిటీ తెలిపింది. రెండేళ్ల వయసులోపే ఈ ఇంజక్షన్‌ను ఇవ్వాల్సి ఉంటుందని వివరించింది. మొహమ్మద్‌ 15 ఏళ్ల సోదరి ఆఫ్రా కూడా ఇదే వ్యాధితో బాధపడుతూ వీల్‌చైర్‌కు పరిమితమైంది. ఆమె చికిత్సకు కూడా ఈ డబ్బును ఉపయోగించి... మిగతా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వినియోగిస్తామని విజిన్‌ వెల్లడించారు.

మరిన్ని వార్తలు