ఆరేళ్లలో 471 ఏనుగులు మృతి  

4 Feb, 2021 08:11 IST|Sakshi

మానవుల దుశ్చర్యలకుబలవుతున్న ఏనుగలు

సాక్షి, బెంగళూరు: తమిళనాడులోని మదుమలైలో ఏనుగుకు నిప్పు పెట్టి చంపిన ఘటన సంచలనం సృష్టించింది. దేశవ్యాప్తంగా గజరాజులకు ప్రాణాపాయం పొంచి ఉందన్న చర్చ మొదలైంది. గజరాజులకు పుట్టినిల్లు వంటి కర్ణాటక వ్యాప్తంగా ఆరేళ్ల కాలంలో సుమారు 78 ఏనుగులు మానవుల అకృత్యాలకు బలి అయినట్లు తెలుస్తోంది. ఇందులో క్రిమిసంహార మందు పెట్టడం, కరెంటు షాక్‌లు, తుపాకులతో కాల్చడం వంటి ఘటనలు ఉన్నాయి. ఆరేళ్ల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా 471 ఏనుగులు మరణించగా, అందులో 393 సహజ మరణాలు, 78 అసహజ మరణాలుగా గుర్తించారు. పంటలపై ఏనుగులు దాడి చేస్తున్నాయని రైతులు వాటిని హతమార్చడానికి కూడా వెనుకాడడం లేదు. 

రోడ్డు ప్రమాదాల్లో.. 

  • అటవీ ప్రాంతం నుంచి బయటికి వచ్చిన ఏనుగులు, మంద నుంచి విడిపోయిన ఏనుగులు దారి తప్పి జనావాసాల్లోకి వస్తున్నాయి. దీంతో రోడ్డు ప్రమాదాల్లో ఏనుగులు మృత్యువాత పడుతున్నాయి.  
  • కొన్నిసార్లు రైలుపట్టాలపై రైళ్లు తగిలి చనిపోతున్నాయి. సహజ మరణాలకు ఏనుగుల మధ్య గొడవలు, సంగమ సమయంలో ఆడవాటిపై మగ ఏనుగుల దౌర్జన్యం, వృద్ధాప్యం వంటివి ప్రధాన కారణాలు.  

కర్ణాటకలో ఆరేళ్లలో ఏనుగుల మరణాలు  

  •  2014–15 మధ్య కాలంలో 77 ఏనుగులు సహజంగా మరణించగా.. మరో 18 మానవ తప్పిదాలకు బలి అయ్యాయి. 
  • 2015–16 కాలంలో 59 ఏనుగులు మరణించగా.. మరో 15 అసహజ మరణాలుగా నమోదు చేశారు. 
  • 2016–17 మధ్య కాలంలో 90 ఏనుగులు సహజంగా మరణించగా.. మరో 10 మానవ అకృత్యాలకు బలి అయ్యాయి. 
  • 2017–18 మధ్యలో 67 ఏనుగులు సాధారణంగా మరణించాయి. మరో 11 ఏనుగులు అసహజంగా చనిపోయాయి. 
  • 2018–19 మధ్య కాలంలో 59 ఏనుగులు సహజంగా.. 15 ఏనుగులు అసహజరంగా మరణించాయి. 
  • 2019–20 కాలంలో 41 ఏనుగులు మామూలుగా మరణించాయి. మరో 9 ఏనుగులు ఇతర కారణాలతో ప్రాణాలు వదిలాయి. 

విద్యుత్‌ కంచెలతో ముప్పు 
రైతులు పంటలను కాపాడుకోవాలని పొలాలు, తోటల్లో విద్యుత్‌ కంచెలు వేస్తున్నారు. అవి అవి తగిలి ఏనుగులు మరణిస్తున్నాయి. విద్యుత్‌ షాక్, తూటాల దెబ్బకు ప్రతి ఏటా సరాసరి 12 ఏనుగులు నేలకొరుగుతున్నాయి. కాల్పుల్లో చనిపోతేనే పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. ఇతర మరణాలను పట్టించుకోవడం లేదు. కాల్పుల కేసుల్లో కూడా దుండగులకు శిక్ష పడిన దాఖలాలు లేవు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు