ఆస్పత్రిలో చేరే వారు 5–10 శాతమే

11 Jan, 2022 06:16 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం నమోదవుతున్న కోవిడ్‌ యాక్టివ్‌ కేసుల్లో 5–10%కి మాత్రమే ఆస్పత్రుల్లో చేరే అవసరం ఉంటోందని కేంద్రం తెలిపింది. అయితే, పరిస్థితులు వేగంగా మారే అవకాశాలున్నందున, ఆస్పత్రుల్లో చేరే అవసరం ఉన్న కేసుల సంఖ్య కూడా పెరగవచ్చని సోమవారం హెచ్చరించింది. అందుకే, హోం ఐసోలేషన్, ఆస్పత్రుల్లో ఉన్న కేసులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలని రాష్ట్రాలను కోరింది.

దేశంలో రెండో వేవ్‌ సమయంలో యాక్టివ్‌ కేసుల్లో ఆస్పత్రుల్లో చేరే అవసరం ఉన్నవి 20–23% వరకు ఉన్నాయని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సోమవారం ఒక లేఖ రాశారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఒమిక్రాన్‌తో పాటు డెల్టా వేరియంట్‌ వల్లనే భారీగా కేసులు నమోదవుతున్నాయని ఆయన అన్నారు.

కోవిడ్‌ సమర్థ యాజమాన్యానికి అవసరమైన మానవ వనరులను సమకూర్చుకోవాలని, ముఖ్యంగా ఆరోగ్య కార్యకర్తలను అందుబాటులో ఉంచుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. మొత్తం యాక్టివ్‌ కేసులు, హోం ఐసోలేషన్‌లో ఉన్నవి, ఆస్పత్రుల్లో ఉన్న కేసులు.. ఇందులో ఆక్సిజన్‌ బెడ్లు, ఐసీయూ బెడ్లు, వెంటిలేటర్‌ సపోర్టుపై ఉన్నవాటిపై సెకండ్‌ వేవ్‌ సమయంలో మాదిరిగానే రోజువారీ సమీక్ష జరపాలని రాష్ట్రాలను ఆయన కోరారు.

    పరిస్థితిని ఎదుర్కొనేందుకు భారీగా కోవిడ్‌ ఆరోగ్య కేంద్రాలు, తాత్కాలిక ఆస్పత్రులను ఏర్పాటు చేసేందుకు వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తీసుకుంటున్న చర్యలను భూషణ్‌ ప్రశంసించారు. అయితే, మానవ వనరులు, మౌలిక వసతులకు పరిమితులున్నాయన్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చేరే కోవిడ్‌ బాధితుల నుంచి వేర్వేరు వసతులున్న బెడ్లకు వసూలు చేసే ఫీజులు న్యాయబద్ధంగా ఉండాలని అన్నారు. వ్యాక్సిన్‌ సెంటర్లు రాత్రి 10 వరకు పనిచేయవచ్చు.. కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రా(సీవీసీ)ల పనివేళలను నిర్దిష్టంగా నిర్ణయించలేదని కేంద్రం తెలిపింది.

మరిన్ని వార్తలు